ఇండియాతో పెట్టుకుంటే ఇట్లే ఉంటది మరీ.. రెండు నెలల్లోనే పాక్‎కు రూ.1,240 కోట్ల నష్టం

ఇండియాతో పెట్టుకుంటే ఇట్లే ఉంటది మరీ.. రెండు నెలల్లోనే పాక్‎కు రూ.1,240 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్థాన్‎కు తగిన శాస్తి జరుగుతోంది. పహల్గాం టెర్రర్ ఎటాక్‎కు నిరసనగా భారత్ ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడంతో పాకిస్థాన్ గొప్పలకు పోయి భారత విమానాలకు తమ దేశ గగనతలాన్ని మూసివేసింది. ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్‎ పాలిట శాపంగా మారింది. భారత విమానాలకు ఎయిర్ స్పేస్ మూసేయడంతో పాకిస్థాన్‎కు భారీ నష్టం వాటిల్లింది. 

కేవలం రెండు నెలల్లోనే దాయాది దేశం రూ.1,240 కోట్లు నష్టాన్ని చవిచూసింది. 2025, ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 వరకు పాక్ మీదుగా భారత విమానాలు రాకపోకలు కొనసాగించకుండా గగనతలం క్లోజ్ చేయడంతో పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) కేవలం రెండు నెలల్లో రూ.1,240 కోట్లు నష్టపోయిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ ఈ విషయాన్ని ధృవీకరించారని డాన్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. 

పాక్ నిర్ణయంతో దాదాపు 150 భారతీయ విమానాలు ప్రభావితమవగా.. పాక్ ఎయిర్ ట్రాఫిక్ 20 శాతం మేర తగ్గింది. ఆసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్‎కు ఈ నిర్ణయం మరింత గుదిబండగా మారింది. కోట్లు నష్టపోతున్నా కూడా పాక్ మాత్రం తన వక్ర బుద్ధిని మార్చుకోవట్లేదు. భారత విమానాలపై గగనతల నిషేధాన్ని 2025, ఆగస్టు 24, వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు భారత విమానాలు ఏవి పాకిస్తాన్ మీదుగా ప్రయాణించలేవు. 

కాగా, జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ మారణహోమానికి పాల్పడింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారత్. 

►ALSO READ | న్యూయార్క్‌‌‌‌ టైమ్స్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌లో కాల్పుల కలకలం

ఇండియా నిర్ణయానికి కౌంటర్‎గా భారత విమానాలకు తమ దేశ గగనతలాన్ని మూసివేసింది పాక్. 2025, ఏప్రిల్ 24 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో పాక్ గుండా భారత్ విమానాలు రాకపోకలు కొనసాగించడానికి వీల్లేకుండా పోయింది. భారత విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీకి ఓవర్‌ఫ్లైయింగ్ ఛార్జీల ఆదాయం భారీగా పడిపోయింది. మన దేశ విమానాలు పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ఉపయోగించుకుంటే ఆ దేశ విమానాశ్రయాల అథారిటీకి కొంత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 

కానీ భారత విమానాలకు పాక్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడంతో ఇప్పుడు ఈ ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందం రద్దు, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో పాక్ అల్లాడిపోతుంది. మరోవైపు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసి భారీగా ఆదాయాన్ని కోల్పోయి తమ కంట్లో తామే పొడుసుకున్నట్లు తయారయ్యింది పాక్ పరిస్థితి.