ఇండియాకు ధమ్కీ ఇచ్చే  దమ్ము ఏ దేశానికీ లేదు

ఇండియాకు ధమ్కీ ఇచ్చే  దమ్ము ఏ దేశానికీ లేదు
  • మా వాళ్లు గొర్రెల్లా అమ్ముడుపోతున్రు
  • ఇంపోర్టెడ్ సర్కారుకు వ్యతిరేకంగా రేపు రోడ్లెక్కండి
  • పాక్ ప్రజలకు ఇమ్రాన్ పిలుపు

ఇస్లామాబాద్: ఇండియాకు ధమ్కీ ఇచ్చేంతటి దమ్ము ప్రపంచంలో ఏ దేశానికీ లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తనను గద్దె దింపేందుకు పాక్ నేతలు అమెరికా డిప్లమాట్ లతో చేతులు కలిపారని ఆయన మరోసారి మండిపడ్డారు. ‘‘నన్ను పదవి నుంచి తొలగించాలంటూ అమెరికా డిప్లమాట్​లు బెదిరింపు లెటర్ రాశారు. వారికి మోకరిల్లే వ్యక్తే ప్రధాని పదవిలో ఉండాలని కుట్ర చేశారు. కానీ.. ఇండియాకు అలాంటి బెదిరింపు పదాలతో లేఖ రాసే దమ్ము మాత్రం ఈ ప్రపంచంలో ఏ దేశానికీ లేదు. మా దేశ నేతలు గొర్రెల్లా అమ్ముడుపోతున్నారు. పాకిస్తాన్​లో ఏర్పడే ఇంపోర్టెడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు దేశ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపాలి” అని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరగనుండటం, ఇమ్రాన్ ఓటమి దాదాపు ఖరారు అయిపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. పాక్ నేతలను అమెరికా డిప్లమాట్ లు కలిసిన తర్వాతే మొత్తం ప్లాన్ బయటకు వచ్చిందని అన్నారు. 22 కోట్ల మంది పాకిస్తానీలను విదేశీ శక్తులు అవమానిస్తున్నాయని మండిపడ్డారు. తన ప్రభుత్వ పతనాన్ని మీడియా సెలబ్రేట్ చేస్కుంటోందంటూ విమర్శించారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రెసిడెంట్ నిర్ణయాలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. అమెరికా డిప్లమాట్​ల బెదిరింపు లేఖపై మరింత దృష్టిపెట్టాల్సి ఉండిందని అభిప్రాయపడ్డారు.