
ఇస్లామాబాద్: పాకిస్తాన్ భూభాగంలో ఇండియన్ మిస్సైల్ పడిన ఘటనపై జాయింట్ ఎంక్వైరీ జరగాలని, అప్పుడే దీని వెనుకున్న నిజాలు బయటికి వస్తాయని పాక్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. టెక్నికల్ సమస్యలతోనే మిస్సైల్ పాక్‌లో పడిందని ఇండియా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేమని స్పష్టం చేసింది. ఈ ఘటనతో సెక్యూరిటీ, సేఫ్టీపై అనేక అనుమానాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మిస్సైల్ పడిన ప్రాంతంలో ఆస్తి నష్టం జరిగిందని తెలిపింది. ‘‘మిస్సైల్‌ను సాయుధ బలగాలే ప్రయోగించాయా? లేక విద్రోహ శక్తులు ప్రయోగించాయా? ఆ మిస్సైల్‌కు సెల్ఫ్ డిస్ట్రక్టర్ మెకానిజమ్ ఉందా? ఎందుకు సరైన ప్రాంతంలో ల్యాండ్ కాలేదు’’ అని పాక్ ఫారిన్ మినిస్ట్రీ ప్రశ్నించింది. మిస్సైల్ ప్రయోగాల సమయంలో జరిగే ప్రమాదాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా ఇండియా వివరించాలని కోరింది.