Asia Cup 2025: రెచ్చిపోయిన బంగ్లా బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాకిస్థాన్

Asia Cup 2025: రెచ్చిపోయిన బంగ్లా బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాకిస్థాన్

బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 డూ ఆర్ డై మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. గురువారం (సెప్టెంబర్ 25)  దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభించడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 31 పరుగులు చేసిన మహమ్మద్ హారీస్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రిషద్ హుస్సేన్, మెహదీ హుస్సేన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. ముస్తాఫిజుర్ రెహమాన్ ఒక వికెట్ దక్కింది.  

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ నుంచే బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం మందగించింది. తొలి ఓవర్ లోనే సాహిబ్జాదా ఫర్హాన్ (4)ను తస్కిన్ అహ్మద్ ఔట్ చేస్తే   రెండో ఓవర్లో స్పిన్నర్ మహేదీ హసన్.. సైమ్ అయూబ్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. దీంతో 5 పరుగులకే పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే లో బంగ్లా బౌలర్లు పూర్తి ఆధిపత్యం చూపించడంతో పాకిస్థాన్ కేవలం 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు మాత్రమే రాబట్టింది. 

►ALSO READ | Women’s ODI World Cup 2025: వరల్డ్ కప్‪కు ముందు కలవరపెడుతున్న గాయం.. వీల్ చైర్‌లో టీమిండియా పేసర్

క్రీజ్ లో ఉన్నంత వరకు ఇబ్బందిపడిన ఫఖర్ జమాన్ 20 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 9 ఓవర్లో రిషద్ హొస్సేన్ బౌలింగ్ లో హుస్సేన్ తలాత్ కూడా ఔట్ కావడంతో పాకిస్థాన్ 36 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ సల్మాన్ అఘా 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. దీంతో బంగ్లాదేశ్ 51 పరుగులకే సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో మహమ్మద్ హారీస్ (31), మహమ్మద్ నవాజ్ (25) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఫైటింగ్ టోటల్ అందించారు.