
ట్రై సిరీస్ విజేతగా పాకిస్థాన్ నిలిచింది. ఆదివారం (సెప్టెంబర్ 8) షార్జా క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై పాకిస్థాన్ 75 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి టైటిల్ అందుకుంది. మొదట బ్యాటింగ్ లో పెద్దగా రాణించని పాకిస్థాన్.. బౌలింగ్ లో మాత్రం అత్యద్భుతంగా రాణించింది. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి లో స్కోరింగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను గెలిపించారు. ఈ విజయంతో ఆసియా కప్ కు ముందు పాకిస్థాన్ ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది.
రెండు జట్లు అక్కడే ఉండడంతో శ్రమ లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులే చేయగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ నత్త నడకన సాగింది. 27 పరుగులు చేసిన ఫకర్ జమాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ సల్మాన్ అఘా (24), మహమ్మద్ నవాజ్ (25) పర్వాలేదనిపించారు,. 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినా ఎట్టకేలకు 140 పరుగుల మార్క్ అందుకొని ఆఫ్ఘనిస్తాన్ కు ఛాలెంజ్ విసిరారు.
ALSO READ : రేపటి (సెప్టెంబర్ 9) నుంచి ఆసియా కప్..
142 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 66 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒక్కరు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయారు. సిడికల్ అటల్ (13), రషీద్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ హ్యాట్రిక్ తీయడంతో మ్యాచ్ పూర్తిగా పాకిస్థాన్ చేతుల్లోకి వచ్చింది. ఓవరాల్ గా నవాజ్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ముకీమ్, అబ్రార్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన నవాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.