
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగౌమ్, సాంబా, తంగదార్, సెక్టర్లలోని భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది. ఓ వైపు కాల్పులు చేస్తూ.. మరోవైపు సరిహద్దులోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది.
సాంబా సెక్టర్, పోఖ్రాన్, ఫిరోజ్‌పూర్, పంజాబ్‌లోని పఠాన్ కోట్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడగా.. వెంటనే అప్రమత్తమైన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాల్లోని ధ్వంసం చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జమ్మూతో పాటు పలు ప్రాంతాల్లో మళ్లీ వార్ సైరన్లు మోగాయి. పాక్ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. పాక్ దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. ఓ వైపు పాక్ ఆర్మీ కాల్పులు తిప్పికొడుతూ.. మరోవైపు గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ డ్రోన్లను తునాతునకలు చేస్తోంది.
పాక్ కవ్వింపు చర్యలతో మరోసారి బోర్డర్లో యుద్ధ వాతావారణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్‌కు కౌంటర్‌గా గురువారం (మే 8) రాత్రి భారత్ పై పాక్ ఆకస్మిక దాడులకు పాల్పడింది. ఫైటర్ జెట్స్, మిస్సైళ్లు, డ్రోన్లతో భారత్ పై దాడులకు ప్రయత్నించింది. భారత సైనిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, ప్రార్ధనా మందిరాలను ప్రధానంగా టార్గెట్ చేసుకుంది. పాక్ దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది.
భారత అమ్ములపొదిలో బ్రహ్మస్త్రమైన ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాక్ ఫైటర్ జెట్లు, మిస్సైళ్లు, డ్రోన్ల భరత పట్టింది. గాల్లోని వాటిని ముక్కలు ముక్కలు చేసేసింది. పాక్ దాడులకు కౌంటర్ ఆ దేశంలో పలు ప్రాంతాల్లో దాడులు చేసింది భారత్. లాహోర్లో పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడంతో పాటు.. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో డ్రోన్లతో దాడి చేసి తమ సత్తా ఏంటో చూపింది.
అంతేకాకుండా పాక్ కు జీవనాధారమైన కరాచీ పోర్టు పైన భారత్ ఎటాక్ చేసి.. పాక్ ను గడగడలాడించింది. ఇలా భారత్ చేతిలో ముప్పేట దాడికి గురై చావు దెబ్బ తిన్న పాక్.. తన వక్రబుద్ధిని మార్చుకోకుండా మళ్లీ శుక్రవారం (మే 9) భారత్ పై దాడులకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన భారత్ పాక్ దాడులను ఎక్కడికక్కడ తిప్పికొడుతోంది. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.