పాక్ ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ కన్నుమూత

పాక్ ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ కన్నుమూత

కరాచీ ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ (49) గురువారం కన్నుమూశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాతే అమీర్ లియాఖత్ మృతికి గల కారణాలు తెలుస్తాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  లియాఖత్ మృతిపై కరాచీ పోలీసులు కేసు నమోదు చేసి  విచారణ మొదలు పెట్టారు.

కరాచీలోని ఖుదాదాద్ కాలనీలోని లియాఖత్ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు.  సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. అటు లియాఖత్  మరణవార్త వినగానే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ రాజా పర్వైజ్ అష్రఫ్‌  సభను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. లియాఖత్ ముత్తాహిదా ఖౌమీ ఉద్యమంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002లో మొదటిసారిగా కరాచీ ఎంపీగా ఎన్నికయ్యారు. లియాఖత్ హుస్సేన్ ఇటీవలే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. 18 ఏండ్ల సయేదా దానియా షాను ఆయన మూడో  పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది పిబ్రవరిలో జరిగింది.