టెర్రరిస్టులను బార్డర్ దాటించేందుకు పాకిస్తాన్‌ కుట్ర

టెర్రరిస్టులను బార్డర్ దాటించేందుకు పాకిస్తాన్‌ కుట్ర

శ్రీనగర్‌‌‌‌: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. టెర్రర్ కుట్రకు తెగబడింది. బార్డర్​లో ఓ వైపు సివిలియన్లు లక్ష్యంగా కాల్పులు జరుపుతూ.. ఇంకోవైపు టెర్రరిస్టులను మన దేశంలోకి పంపేందుకు ప్రయత్నించింది. గురెజ్ నుంచి యురి సెక్టార్ వరకు లైన్​ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వెంబడి శుక్రవారం ఫైరింగ్ చేసింది. ఇదే సమయంలో కేరన్ సెక్టార్​లో బార్డర్ దాటి దేశంలోకి చొరబడేందుకు టెర్రరిస్టులు ప్రయత్నించారు. పాక్ పన్నాగాన్ని ముందే పసిగట్టిన ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. పాక్ స్థావరాలపై మిసైళ్లు, రాకెట్లతో విరుచుకుపడింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బంది, ఒక బీఎస్ఎఫ్ సబ్ ఇన్​స్పెక్టర్, ఆరుగురు పౌరులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. అటు పాక్ వైపు కూడా 7 లేదా 8 మంది సోల్జర్లు చనిపోయినట్లు ఆఫీసర్లు చెప్పారు.

ఉదయం నుంచి..

శుక్రవారం ఉదయం నుంచి పాక్ కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. పూంఛ్, బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల బార్డర్లలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఫైరింగ్ చేసింది. ‘‘దావార్, కేరన్, యురి, నౌగం, గురెజ్ తదితర సెక్టార్లలో మోర్టార్లు, ఇతర హెవీ వెపన్లతో ఇండియన్ స్థావరాలను పాక్ సోల్జర్లు టార్గెట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా సివిలియన్ ఏరియాలకు గురిపెట్టి  కాల్పులు జరిపారు. ఇదే అదనుగా కేరన్ సెక్టార్​లో పాక్ వైపు నుంచి టెర్రరిస్టులు చొరబాటుకు యత్నించారు. వీళ్లకు సాయం చేసేందుకు పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. పాక్ ఆర్మీ, టెర్రరిస్టుల ప్రయత్నాలను ఫార్వర్డ్ పోస్టుల వద్ద మన ఆర్మీ అడ్డుకుంది” అని డిఫెన్స్ స్పోక్స్​పర్సన్, కల్నల్ రాజేశ్ కాలియా చెప్పారు. ‘‘కేరన్ సెక్టార్​లో ఎల్​ఓసీ వెంబడి అనుమానాస్పద కదలికలను ట్రూప్స్ గుర్తించాయి. వెంటనే అలర్ట్ అయిన ట్రూప్స్.. చొరబాటును భగ్నం చేశాయి” అని చెప్పారు.

ఆరుగురు సివిలియన్లు..

పాక్ కాల్పుల్లో యురీలోని నంబ్లా సెక్టార్‌‌‌‌లో ఇద్దరు ఆర్మీ సోల్జర్స్‌‌, హాజీపీర్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌‌ఎఫ్‌‌) సబ్‌‌ ఇన్​స్పెక్టర్‌‌‌‌ చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని కమల్‌‌కోటె సెక్టార్‌‌‌‌లో ఇద్దరు సివిలియన్స్‌‌, హాజీ పీర్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లోని బాల్కోటె ఏరియాలో ఒక మహిళ చనిపోయినట్లు అధికారులు చెప్పారు. మొత్తంగా ఆరుగురు సివిలియన్లు, ముగ్గురు జవాన్లు, బీఎస్ఎఫ్ ఎస్ఐ చనిపోయారు. మరో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, 8 మంది పౌరులు గాయపడ్డారు. కాల్పులను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, పాక్ వైపున పలువురు చనిపోయారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ వైపు 7 నుంచి 8 మంది చనిపోయినట్లు తెలుస్తోందని చెప్పాయి. మరో 12 మంది గాయపడ్డారని చెప్పాయి. పాక్ కాల్పుల నేపథ్యంలో ఎల్ఓసీ వెంబడి అన్ని బీఎస్ఎఫ్ యూనిట్లు అలర్ట్ గా ఉంటూ ధీటుగా బదులిస్తున్నాయి. ఆర్టిలరీ రెజిమెంట్, సహాయక ఆయుధాలను అమర్చినట్లు ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. కేరన్ నుంచి యురి సెక్టార్ వరకు చాలా చోట్ల కాల్పుల విరమణ ఉల్లంఘనలు కొనసాగాయని తెలిపారు.

పాక్ స్థావరాల పేల్చివేత

ఎల్ఓసీ వెంబడి పీవోకేలో ఉన్న బంకర్లను ఇండియన్ ఆర్మీ పేల్చివేసింది. కొండల పైన ఉన్న స్థావరాలను యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, రాకెట్లతో మన ఆర్టిల్లరీ టీం తునాతునకలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆర్మీ వర్గాలు రిలీజ్ చేశాయి. పాకిస్తాన్​కు చెందిన మందుగుండు సామగ్రి, ఫ్యుయల్​ను స్టోర్ చేసిన బిల్డింగ్స్ మంటల్లో కాలిపోవడం వీడియోల్లో కనిపించింది. మిసైల్ నుంచి తప్పించుకునేందుకు బంకర్ నుంచి ఓ పాక్ సోల్జర్ పారిపోవడం ఓ వీడియోలో కనిపించింది. తర్వాత మరో రెండు మిసైళ్లు బంకర్​ను పేల్చేశాయి. పాక్ మిలటరీ స్ట్రక్చర్లను కూడా మన ఆర్మీ పేల్చేసింది. డంపులను, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను డ్యామేజ్ చేసింది. పాక్ వైపు ఇన్​ఫ్రాస్ట్రక్చర్లకు భారీగా నష్టం జరిగిందని, చాలామంది చనిపోయారని వెల్లడించింది.

వారంలో రెండోసారి

గత వారంరోజుల్లో ఇది రెండో చొరబాటు ప్రయత్నం. ఈ నెల 7న మచిల్ సెక్టార్​లో చొరబాటుకు ప్రయత్నించారు. అడ్డుకున్న సోల్జర్లు ముగ్గురు టెర్రరిస్టులను ఖతం చేశారు. టెర్రరిస్టులతో పోరులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ర్యాడ మహేశ్​తోపాటు మరో ఇద్దరు జవాన్లు, ఓ ఆఫీసర్ వీరమరణం పొందారు.

‘‘కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాక్ ప్రయత్నించినప్పుడల్లా.. ఆ దేశం భయాలు, బలహీనతలు మరింత స్పష్టంగా కనిపిస్తా యి. మన సోల్జర్లు పండుగ సమయంలో కూడా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని రక్షించుకుంటున్నారు. పాకిస్తాన్ అసహ్యకరమైన ప్లాన్లను ధ్వంసం చేస్తున్నారు. ఆర్మీలోని ప్రతి సైనికుడికి నా వందనం’’ – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్