పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్​..జాతీయ హోదాకు కృషి చేస్త : మల్లు రవి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్​..జాతీయ హోదాకు కృషి చేస్త : మల్లు రవి
  •  విభజన హామీల సాధనలో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ 
  •  ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు
  •  డప్పు చప్పుళ్లతో స్వాగతం.. భారీగా కాంగ్రెస్ నేతల హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడం, కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న అం శాల పరిష్కరించడంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. ఈ దిశలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ భవన్​లో ఆయన స్పెషల్ రిప్రజెంటీవ్ (ఎస్ఆర్)గా బాధ్యతలు చేపట్టారు. డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లు రవి కూడా డప్పు వాయించారు.

తర్వాత గురజాడ హాల్​లో భవన్ రెసిడెంట్ కమిషనర్ డా గౌరవ్ ఉప్పల్, మల్లు రవితో ఎస్ఆర్​గా సంతకం చేయించారు. కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తర్వాత రవి మాట్లాడుతూ.. తనను ఎస్ఆర్​గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. నీటి ప్రాజెక్టులు, ఆర్థిక, రక్షణ శాఖకు చెంది న అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 15 అంశాల పట్ల ప్రధానికి వినతులు అందజేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి పాజెక్టుకు జాతీయ హోదా సహా పెండింగ్ అంశాలను ప్రాధాన్యత క్రమంలో కేం ద్రం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. త్వరలో తెలంగాణ నుంచి డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తోన్న సివిల్ సర్వీస్ అధికారులతో సమావేశమై.. తెలంగాణ అభివృద్ధి కోసం వారి సహకారం కోరుతామని వివరించారు.

త్వరలో తెలంగాణ భవన్ నిర్మాణం

త్వరలో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ప్రారంభమవుతుందని మల్లు రవి అన్నారు. ఢిల్లీ లోని ఉమ్మడి భవన్ వ్యవహారంలో కేసీఆర్ పదేండ్లు చేయని పనిని.. రేవంత్ రెడ్డి సీఎం అయిన పది రోజుల్లో క్లియర్ చేశారన్నారు. ఉమ్మడి భవన్ స్థలం విభజనపై ఏపీ, తెలంగాణ భవన్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. హైదరాబాద్ హౌస్​కు అనుకొని ఉన్న శబరి బ్లాక్, పరిధిలోని మూడున్నర ఎకరాల స్థలం తెలంగాణకు వస్తుందన్నారు. అలాగే పటౌడి హౌస్ లో ఐదున్నర ఎకరాలు తెలంగాణ తీసుకుంటుందని చెప్పారు.