హాట్ సెగ్మెంట్ పాలేరు..సీటు కోసం తుమ్మల, షర్మిల, పొంగులేటి పోటీ

హాట్ సెగ్మెంట్ పాలేరు..సీటు కోసం తుమ్మల, షర్మిల, పొంగులేటి పోటీ
  • తుమ్మలకు లైన్ క్లియర్ అయిందంటున్న అనుచరులు
  • పొంగులేటికి ఖమ్మం తప్ప ఆప్షన్ కనిపిస్తలే
  • షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్!

ఖమ్మం, వెలుగు: పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్​ గా మారింది. ఆ సీటు కోసమే ముగ్గురు కీలక నేతలు పట్టుబడుతుండడం ఆసక్తిగా మారింది. వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పాలేరు సీటు పైనే ఆశలు పెట్టుకున్నారు. పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఏదైనా సరే అంటూ కాంగ్రెస్ టికెట్ కోసం అప్లికేషన్లు వేసినా, ప్రస్తుతం మాత్రం పాలేరు వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇక షర్మిల, తుమ్మల ఇద్దరూ కాంగ్రెస్ లో చేరిక కోసం పాలేరు మస్ట్ అని కండిషన్లు పెడుతున్నారు. దీంతో ఈ ముగ్గురిలో చివరకు ఎవరు పాలేరు సీటును దక్కించుకుంటారనేది కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని ఇప్పటికే ఆ పార్టీ ఫైనల్ చేయగా, కాంగ్రెస్ లో మాత్రం ఈ ముగ్గురిలో పోటీ చేసే అభ్యర్థి ఎవరని తేలేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

పాలేరుపై తుమ్మల పట్టు

ప్రస్తుతం కాంగ్రెస్​ కార్యకర్తల్లో షర్మిల పార్టీ విలీనం, తుమ్మల చేరికపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. వీళ్లిద్దరి వల్ల పార్టీకి కలిగే లాభనష్టాలపై డిస్కషన్ ఒకవైపు ఉండగా, మరోవైపు టికెట్ ఎవరు తెచ్చుకుంటారనే చర్చ ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తుమ్మల భేటీ కావడంతో, బీఆర్ఎస్ ను వీడి ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపు కన్ఫామ్ అయింది. అయితే పాలేరు సీటును కేటాయిస్తామని హామీ వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డితో మీటింగ్​కు తుమ్మల ఒప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి దీనికి కొంత భిన్నంగా సమాచారం తెలుస్తోంది. పాలేరు సీటు కన్ఫామ్​ చేసేందుకు వంద శాతం ప్రయత్నిస్తానని, కానీ పార్టీ అవసరాల దృష్ట్యా అవకాశాన్ని బట్టి ఖమ్మంలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తుమ్మలకు రేవంత్ చెప్పినట్టు సమాచారం. ఖమ్మంలో పోటీ చేసేందుకు సిద్ధమైతే ఎన్నికల ఖర్చు విషయాన్ని కూడా తాను చూసుకుంటానని హామీనిచ్చినట్టు టాక్​ వినిపిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి నుంచి తుమ్మలను పోటీ చేయాలని కాంగ్రెస్ కోరినట్టుగా ప్రచారం జరిగినా, తుమ్మల మాత్రం పాలేరు తప్పించి మరెక్కడా పోటీపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటాను తప్పించి, సీటు మారేది లేదని తేల్చి చెప్పారని, ఆ తర్వాతనే రేవంత్ రెడ్డితో మీటింగ్ జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్​ మాత్రం కమ్యూనిటీ ఈక్వేషన్ల దృష్ట్యా పాలేరు నుంచి పొంగులేటిని, ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయించాలని భావిస్తోందని సమాచారం.

జిల్లాలో ఎక్కడి నుంచైనా పొంగులేటి

మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎక్కడైనా సిద్ధమంటూ అప్లై చేశారు. ఆ తర్వాత మారిన పరిణామాలు, కమ్యూనిస్టులతో చర్చలు, తుమ్మల చేరిక వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో పార్టీ ఆలోచన మేరకు పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డిపై పోటీకి సిద్ధమయ్యారు. నాలుగు మండలాల్లో క్యాంప్ ఆఫీస్ ల ఏర్పాటుకు ఆయన సన్నిహితులు స్థలాల పరిశీలన చేశారు. పాలేరు పరిధిలోని ముఖ్యనేతలతోనూ మాట్లాడి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సమయంలో తుమ్మల ఎంట్రీతో సీన్ మారింది. చివరకు పాలేరు సీటు రేసు నుంచి తుమ్మల తప్పుకోకపోతే పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సీపీఐతో కాంగ్రెస్ చర్చలు ఒకవైపు, జలగం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరొచ్చన్న ప్రచారం మరోవైపు ఉండడంతో కొత్తగూడెం ఆప్షన్ పొంగులేటికి లేదని అనిపిస్తోంది. జలగం రాకున్నా, పొత్తుల్లో సీపీఐకి ఆ సీటును కాంగ్రెస్ కేటాయించే చాన్సుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాలేరు లేకపోతే, ఖమ్మం నుంచి పొంగులేటి పోటీ చేసే అవకాశముంది.

ఫైనల్ ​స్టేజ్​లో షర్మిల పార్టీ విలీన చర్చలు

ఇక కాంగ్రెస్​లో షర్మిల పార్టీ విలీనం చర్చలు తుది దశకు వచ్చాయి. తాజాగా సోనియా, రాహుల్​తో ఆమె ఢిల్లీలో మీటింగ్ తర్వాత షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ ఆఫర్ చేశారన్న ప్రచారముంది. పాలేరు సీటు గురించి షర్మిల పట్టుబట్టినా, కాంగ్రెస్​ అందుకు రెడీగా లేదని తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ హోదాతో పాటు రాజ్యసభ సీటిస్తామని చెప్పినట్టు సమాచారం. విలీన చర్చల సమయంలో సికింద్రాబాద్ బరిలో ఉండాలని చెప్పినట్టు ప్రచారం జరిగినా, చివరకు  ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభ సీటు, స్టార్​ క్యాంపెయినర్ పదవి, ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతల అప్పగింత లాంటి అంశాలపైనే డిస్కషన్స్​ జరిగాయని తెలుస్తున్నది. కాగా, షర్మిల రెండేండ్లుగా పాలేరులో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.