జనగామలో పల్లా ఓవరాక్షన్​.. మున్సిపల్​ మీటింగ్​కు మీడియా రాకుండా అడ్డంకులు

జనగామలో పల్లా ఓవరాక్షన్​.. మున్సిపల్​ మీటింగ్​కు మీడియా రాకుండా అడ్డంకులు
  • సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్​ కౌన్సిలర్ల పట్టు
  • సర్కారు మీదే కదా పర్మిషన్​ తెప్పించాలన్న ఎమ్మెల్యే  
  • మున్సిపల్​ ఆఫీస్​ ముందు జర్నలిస్టుల నిరసన
  • మద్దతు తెలిపిన కాంగ్రెస్​ కౌన్సిలర్లు

జనగామ, వెలుగు:  రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. మీడియాపై వారి వివక్ష కంటిన్యూ అవుతోంది. జనగామలో  స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి..మంగళవారం జరిగిన మున్సిపల్​ మీటింగ్​కు జర్నలిస్టులను రానియ్యకుండా అడ్డుకున్నారు. మున్సిపల్కమిషనర్​కు చెప్పి బయటికి పంపించారు. జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. మీడియాను లోనికి అనుమతించాలని పట్టుబట్టిన కాంగ్రెస్​ కౌన్సిలర్లతో మీదే గవర్నమెంటు కదా, పర్మిషన్​ జీవో తెప్పించండి అంటూ వెటకారంగా మాట్లాడారు. జనగామ మున్సిపల్​ జనరల్​బాడీ మీటింగ్​ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ​కాన్ఫరెన్స్​హాల్​లో చైర్​పర్సన్ ​పోకల జమున లింగయ్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. దీనికి చీఫ్​గెస్ట్​గా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి హాజరయ్యారు.

మీటింగ్​ కవరేజ్​ ​కోసం  మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి కనుసైగతో ఇన్​చార్జి కమిషనర్​ చంద్రమౌళి..మీడియా ప్రతినిధులను బయటకు పంపించాలని అక్కడే ఉన్న మున్సిపల్ ​మేనేజర్​రాములును ఆదేశించారు. మేనేజర్​బయటకు వెళ్లాలని చెప్పడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ​గవర్నమెంట్ వచ్చాక ఇటీవల జరిగిన మున్సిపల్​ మీటింగ్​కు అనుమతించారని, ఇప్పుడు మళ్లీ ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఇన్​చార్జి కమిషనర్​ చంద్రమౌళి వచ్చి మీడియాకు అనుమతి లేదని చెప్పే ప్రయత్నం చేశారు. నాటి మున్సిపల్ ​మంత్రి కేటీఆర్..మున్సిపాలిటీల్లో జరుగుతున్న విషయాలు బయటకురావద్దని కేవలం ఓరల్​ఆర్డర్స్​ మాత్రమే ఇచ్చారని, అది అఫీషియల్ ​కాదని జర్నలిస్టులు చెప్పారు. కొత్త సర్కారు ఏమైనా జీవో ఇచ్చి ఉంటే చూపాలని నిలదీయడంతో ఇన్​చార్జి కమిషనర్​తెల్లమొహం వేశారు. అదే సమయంలో ఎమ్మెల్యేకు చెందిన సోషల్​మీడియా ప్రతినిధులు మాత్రం దర్జాగా మీటింగ్ ​హాల్​లోనే కూర్చుండిపోయారు.

దీనిపై జర్నలిస్టులు ప్రశ్నించగా ఆఫీసర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో కాంగ్రెస్ ​ కౌన్సిలర్ ​భర్త, సీనియర్​లీడర్ వంగాల మల్లారెడ్డి మీటింగ్​ హాల్​లోకి వచ్చి మొత్తం మీడియానైనా అనుమతించాలని, లేదంటే హాల్​లో కూర్చున్న ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులనైనా బయటకు పంపాలని పట్టుబట్టారు. దీంతో సోషల్​మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు. తర్వాత ఆగ్రహించిన జర్నలిస్టులు ఆఫీస్ ​ముందు  నిరసన వ్యక్తం చేశారు. వారికి కాంగ్రెస్ ​కౌన్సిలర్లు జక్కుల అనిత, వంగాల కల్యాణి, గంగరబోయిన మల్లేశం, రామగల్ల అరుణ, ముస్త్యాల చందర్ ​సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ కౌన్సిలర్లు మాట్లాడుతూ గత జనరల్​ బాడీ మీటింగ్ ​లోపలికి జర్నలిస్టులను అనుమతిచ్చిన ఆఫీసర్లు ఇప్పుడెందుకు అనుమతించడం లేదన్నారు.

నియంతృత్వ, గడీల పాలనను ఓడించి కాంగ్రెస్​ ప్రజా పాలనకు జనం పట్టం కట్టినా బీఆర్ఎస్​ ఎమ్మెల్యే తీరు మారడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాపై ఎమ్మెల్యే ఆంక్షలు ఏమిటన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్​ఆఫీస్​ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా అక్కడికి వచ్చారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న ఎమ్మెల్యే స్పందించకపోగా మీడియాను బయటకు పంపడంలో తన తప్పేమీ లేదని తన అనుచరులతో చెప్పించడం కొనమెరుపు.