- పాలేరులో పల్లా ట్రిక్స్
- కందాల, తుమ్మల మధ్యలోకి రాజేశ్వర్ రెడ్డి
- ఉపేందర్‌రెడ్డికి సపోర్టుగా ఉంటానని భరోసా
- ఇప్పటికే ఉప్పునిప్పులా ఇరువర్గాలు..
- పల్లా ఎంట్రీతో మరింత గ్యాప్..
- రగులుతున్న తుమ్మల వర్గం
- ప్రచార రథాన్ని కూడా దింపిన సిట్టింగ్ ఎమ్మెల్యే
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాలేరు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. గత ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓడినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో విధంగా పాలేరు సెగ్మెంట్ పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లో ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కందాల, ఆ తర్వాత అధికార టీఆర్ఎస్లో చేరడంతో ఇద్దరు లీడర్ల మధ్య వర్గపోరు నడిచింది. షర్మిల కూడా తాను ఈ సీటు నుంచే పోటీ చేస్తానని ప్రకటించడం, తాజాగా పొత్తులో భాగంగా సీపీఎంకు ఈ నియోజకవర్గాన్ని కేటాయిస్తారన్న ప్రచారం, ఒకరిపై ఒకరు మాటల దాడి.. ఇలా పలు రకాల కారణాలతో పాలేరు హాట్ సీటుగా మారింది. రీసెంట్ గా మరో ముఖ్య నేత పాలేరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాలుగా విడిపోయి ఉండగా పల్లా ఎంట్రీతో పరిణామాలు ఏ విధంగా మారతాయోనన్న డిస్కషన్ మొదలైంది.
ఫుల్ సపోర్ట్ ఉంటా..
ఇటీవల రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలో పాలేరు నుంచి వచ్చిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అనుచరులతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారని సమాచారం. పొత్తులో భాగంగా పాలేరు సీటును సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వారితో మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కందాలకు ఖాయంగా టికెట్ వస్తుందని వారికి చెప్పారు. ''లెఫ్ట్ పార్టీలకు టికెట్లు ఇచ్చే ఆలోచన సీఎంకు లేదు. వారికి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ, లేదా నామినేటెడ్ పదవులతో సరిపెడతారు. ఒకవేళ సీట్లిచ్చే పరిస్థితి వచ్చినా నా ప్రమేయం లేకుండా సీట్లు ఫైనల్ చేయరు. పాలేరు సీటు విషయంలో కందాల కోసం ధైర్యంగా మాట్లాడదాం, నా ఫుల్ సపోర్టు మీకుంటుంది” అని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ మీటింగ్ విషయం బయటకు రావడంతో తుమ్మల వర్గీయులు పల్లాపై మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సీఎం కేసీఆర్‌కు, తుమ్మలకు మధ్య గ్యాప్ రావడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డే ప్రధాన కారణమని ఇప్పటికే వారు భావిస్తున్నారు. కొన్ని అంశాల్లో తుమ్మల అభిప్రాయాలను, చేయని కామెంట్లను సీఎం కేసీఆర్‌కు ఆయన తప్పుగా ప్రజెంట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా తుమ్మలకు వ్యతిరేకంగా మీటింగ్ ఏర్పాటు చేయడంపై గుస్సాగా ఉన్నారు.
ప్రచార రథాన్ని దింపిన కందాల..
పాలేరులో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోగా, ఆయనపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి కొద్ది నెలల్లోనే అధికార పార్టీలో చేరారు. దీంతో ఇద్దరి మధ్య వర్గపోరు మొదలైంది. తన కేడర్‌ను కాపాడుకునేందుకు తుమ్మల, పార్టీలో పట్టు సాధించేందుకు కందాల చేసిన ప్రయత్నాలతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం కార్యకర్తలపై పోలీసు కేసుల వరకు వెళ్లింది. మాజీ మంత్రిగా, సీఎం కేసీఆర్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని ఒకవైపు తుమ్మల ధీమాగా ఉండగా, సిట్టింగ్ కోటాలో తనకు సీటు పక్కా అన్ని కందాల కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరు ఇలా ఉన్న సమయంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ పొత్తు కుదరడం, వచ్చే ఎన్నికల్లోనూ అది కంటిన్యూ అవుతుందని ఆయా పార్టీలు చెబుతుండడం, పాలేరులో తాను పోటీ చేయడం పక్కా అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏర్పాట్లు చేసుకుంటుండడం ఆసక్తికరంగా మారింది. అదే టైంలో కందాల ఉపేందర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి ఏకంగా రూ.15 లక్షలతో వచ్చే ఎన్నికల కోసం హైదరాబాద్‌లో ప్రచార రథాన్ని తయారు చేయించి కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఉంచారు.