రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు తగ్గిన ఓటింగ్

రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు తగ్గిన ఓటింగ్

లీడ్‌లో ఉన్న ముగ్గురిలో కోదండరాంకు అధిక ఓట్లు

నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ప్రయారిటీ ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు ఓటింగ్ శాతం తగ్గింది. ఈ రెండో ప్రయారిటీ ఓట్లలో కోదండరాం పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. ఆయనకు ఈ రౌండులో ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి.  ఈ రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 6,586 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 8,563 ఓట్లు రాగా.. కోదండరాంకు 9,038 ఓట్లు వచ్చాయి. సెకండ్ ప్రయారిటీ ఓట్లలో మల్లన్న కంటే కోదండరాం 475 ఓట్లు ఎక్కువగా సాధించాడు. ఎలిమినేషన్ ప్రకియ కొనసాగుతుండటంతో నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కీలక దశకు చేరుకుంది.  ఫస్ట్ ప్రయారిటీ  ఓట్లలో ఏ అభ్యర్థికీ సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. దాంతో సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ స్థానంలో మొత్తంగా 71 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఇప్పటి వరకు 67 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ అయిన అభ్యర్థుల సెకండ్ ప్రాధాన్యత ఓట్లను.. లీడ్‌లో ఉన్న అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. 

ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,17,386 ఓట్లు వచ్చాయి. మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరామ్‌కు 79,110 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 42,015 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రాములు నాయక్‌కు పోలైన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.