పల్లా, ముత్తిరెడ్డి మధ్య మళ్లీ లొల్లి .. కేటీఆర్​తో చర్చించినా తెగని పంచాది

పల్లా, ముత్తిరెడ్డి మధ్య మళ్లీ లొల్లి .. కేటీఆర్​తో చర్చించినా తెగని పంచాది
 
  • అనుచరులతో రాజేశ్వర్ రెడ్డి రహస్య మీటింగ్
  • ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ఫైర్
  • విమర్శలు పట్టించుకోని పల్లా

జనగామ, వెలుగు:  జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ప్రగతిభవన్​లో ఇద్దరి పంచాయితీపై చర్చ తర్వాత మెత్తబడినట్లు కనిపించిన ముత్తిరెడ్డి.. రెండు రోజులుగా పల్లాపై విరుచుకుపడుతున్నారు. వరుస పర్యటనలతో ఆయన్ని టార్గెట్ చేసుకుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్టీ ఓడిపోవద్దనే అధిష్టానం తనను బరిలో నిలబెట్టిదంటూ మరోవైపు పల్లా ప్రచారం చేసుకుంటున్నారు. లీడర్లు, జనాలు తననే కోరుకుంటున్నారని, కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని ముత్తిరెడ్డి చెప్పుకుంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే మెత్తబడలే..

పల్లాకు టికెట్ ఖరారు చేసినట్లు జనగామాలో ప్రచారం జరిగింది. దీంతో ఇటీవల ముత్తిరెడ్డి, పల్లాతో ప్రగతి భవన్​లో కేటీఆర్ భేటీ అయ్యారు. కూతురు తుల్జా భవానీ రెడ్డి ఎపిసోడ్.. పార్టీకి నష్టం కలిగించేలా ఉండటంతోనే పల్లాకు టికెట్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కేటీఆర్ చెప్పారు. అయితే, అదేరోజు సీఎం కేసీఆర్​ను ముత్తిరెడ్డి కలిసి తన కుటుంబ సమస్యలు వివరించారు. నియోజకవర్గంలోని మహిళా ప్రజా ప్రతినిధులంతా తన వెంటే ఉన్నారని, ఇంటి సమస్యను పరిష్కరించుకుంటానని కేసీఆర్​తో చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, కేటీఆర్​తో చర్చల్లో ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ, ముత్తిరెడ్డి అందుకు ఒప్పుకోలేదని ఆయన వర్గీయులు చెప్తున్నారు. కేటీఆర్​తో మాట్లాడిన మరుసటి రోజే తరిగొప్పుల మండలంలో మాట్లాడుతూ.. కేసీఆర్ డైరెక్షన్​లో పనిచేస్తానని ప్రకటించారు. 

పల్లాపై ఆగని ముత్తిరెడ్డి విమర్శలు

మూడు రోజుల కింద ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డి నిడిగొండలో భారీ మీటింగ్ పెట్టడంతో మళ్లీ లొల్లి స్టార్ట్ అయింది. దీంతో పల్లాపై ముత్తిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “పల్లా సమైక్యవాది. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పని చేశావ్. అధిష్టానం మందలించినా పట్టించుకుంటలేవ్.. పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నవ్.. గ్రూపు రాజకీయాలు చేస్తున్నవ్.. పార్టీ లైన్ ధిక్కరిస్తున్నవ్.. కార్యకర్తల మధ్య దూరం పెంచుతున్నవ్.. పార్టీ నిర్ణయమే ఫైనల్ కదా? అప్పటిదాకా ఎందుకు ఆగుతలేవ్?” అంటూ శనివారం జనగామలో, ఆదివారం బచ్చన్నపేటలో పల్లాపై ముత్తిరెడ్డి విరుచుకుపడ్డారు.

దూకుడు పెంచిన పల్లా


ముత్తిరెడ్డి విమర్శలు పట్టించుకోకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే సిద్దిపేట రోడ్​లోని వికాస్ నగర్​లో పెద్ద ఇండ్లను అద్దెకు తీసుకున్నారు. దీని పక్కనే రెండు ఎకరాల్లో అధునాతన టెంట్లు వేసి ఎలక్షన్ తంతు పూర్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యక్తిగత సిబ్బందితో గ్రౌండ్ లెవల్​లో రిపోర్ట్ తయారు చేయించుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఎలక్షన్ కోడ్ రాకముందే.. జనగామ మున్సిపల్ పరిధిలో రూ.50 కోట్లు, చేర్యాల మున్సిపల్ పరిధిలో రూ.25 కోట్లతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్​ల నిర్మాణానికి నిధుల మంజూరుకు అంతా సిద్ధం చేసినట్లు లీడర్లకు చెబుతున్నారు. టికెట్ ఖరారైన వెంటనే భారీ ర్యాలీగా కొమురవెల్లి నుంచి జనగామకు వెళ్లేలా ఏర్పాటు చేసుకున్నారు. సంబరాలకు కావాల్సినవన్నీ ఇప్పటికే అన్ని మండలాలకు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.