
- గవర్నమెంట్ హాస్పిటల్, ఎంసీహెచ్‌కు వెళ్లేందుకు ఆటోలే దిక్కు
- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
భద్రాద్రికొత్తగూడెం: ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది. పాల్వంచ మెడికల్ కాలేజీకి సొంత భవనం లేక నర్సింగ్ కళాశాలలో కొనసాగుతోంది. మొత్తం 196 ప్రధాన పోస్టులకు గానూ 108 ఖాళీలున్నాయి. హడావుడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పోస్టులను భర్తీ చేయలేదు.
అంతేకాకుండా కాలేజీ, హాస్టల్ బిల్డింగ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) ఇటీవల మెడికల్ కాలేజీ నిర్వహణపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీల్లో నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. లేని పక్షంలో సీట్లు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో మెడికల్‌కాలేజీల్లో ఎన్ఎంసీ సూచనల ప్రకారం.. సౌకర్యాలు, బిల్డింగ్లు ఉన్నాయా, ఫ్యాకల్టీ వివరాలు తదితర అంశాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ బుధవారం పాల్వంచ మెడికల్ కాలేజీని సందర్శించింది. ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం మూడు బ్యాచ్‌లు..
పేషెంట్లకు మెరుగైన వైద్యం అందాలంటే మెడికల్‌కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన జరగాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. మెడికల్‌కాలేజీల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం అరకొరగా నియామకాలు చేపట్టి చేతులెత్తేసింది. పాల్వంచ కళాశాలలో అనాటమీ డిపార్ట్మెంట్లో డాకర్లు లేరు. ఎమ్మెస్సీ చేసినవారితో నడిపిస్తున్నారు. ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మూడు బ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. ఆగస్టులో మరో కొత్త బ్యాచ్రానుంది. ఫలితంగా క్లాస్ రూమ్‌లకు ఇబ్బంది కలగనుంది.
ప్రమాదాల బారిన స్టూడెంట్స్..
పర్మినెంట్ మెడికల్ కాలేజీ, హాస్టల్ బిల్డింగ్లు లేకపోవడంతో స్టూడెంట్స్ అష్టకష్టాలు పడుతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్హాస్టళ్ల నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి గవర్నమెంట్హాస్పిటల్, ఎంసీహెచ్‌కు ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నాలుగు రోజుల కిందట హాస్టల్నుంచి కాలేజీకి వస్తున్న ఆటో యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
ఉద్యోగాలు సాంక్షన్ పోస్టులు ఖాళీలు
ప్రొఫెసర్స్ 19 09
అసోసియేట్ ప్రొఫెసర్స్ 39 34
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 49 09
సీనియర్ రెసిడెంట్స్ 57 37
ట్యూటర్స్ 32 19
మొత్తం 196 108