ఆదిలాబాద్, వెలుగు: రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. అనేక చోట్ల రాత్రి వరకు కూడా అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో రూరల్ మండలం, బేల, జైనథ్, సాత్నాల, బోరజ్, భీంపూర్, తాంసి, మావల మండలాల్లో 156 గ్రామ పంచాయతీల్లోని 39 క్లస్టర్లలో నామినేషన్లు తీసుకున్నారు. నిర్మల్జిల్లాలో నిర్మల్ రూరల్, సోన్, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్(జి), లోకేశ్వరం, కుంటాల మండలాల్లోని 131 గ్రామ పంచాయతీల్లో 42 క్లస్టర్లలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
ఇక ఆసిఫాబాద్జిల్లాలో బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్ పేట్, సిర్పూర్(టి) ఏర్పాటు చేసిన 33 క్లస్టర్లు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన 37 క్లస్టర్లలో అధికారులు నామినేషన్లు స్వీకరించారు. బుధవారం నామినేషన్ల పత్రాల పరిశీలన, 4న ఫిర్యాదుల స్వీకరణ, 5న విచారణ, 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు.
