ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేయొద్దు.. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే రూ. 25 లక్షల నిధులు ఇస్తా ..

ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేయొద్దు.. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే  రూ. 25 లక్షల నిధులు ఇస్తా ..
  • బీఆర్ఎస్​ మద్దతుతో పోటీచేసినవారు ఎన్నికైనా ఏం చేయలేరు 
  • మెదక్ ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట రూరల్/మెదక్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామానికి రూ. 25 లక్షల నిధులు ఇస్తానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హామీ ఇచ్చారు. శనివారం సిద్దిపేట టౌన్,  మెదక్ టీఎన్జీఓ భవన్​లో ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారు. సర్పంచ్ పదవి కోసం రూ. లక్షల్లో వేలం పాటలు పాడుతూ డబ్బులు వెదజల్లుతున్నారన్నారు. వేలంలో సర్పంచ్ పదవిని కొనుక్కోవడమంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టేనని విమర్శించారు.

 ఇలాంటి వాటిని ఎంకరేజ్​చేయొద్దన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నేరుగా పంచాయతీల అకౌంట్లలోకి  డబ్బులు పంపిస్తోందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3500 కోట్ల నిధులు ఎక్కడ ఆగిపో తాయనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తోందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం వద్ద పైసల్లేవని, బీజేపీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులు సర్పంచ్​లుగా గెలిస్తేనే  కేంద్రం నుంచి నిధులు వచ్చి పంచాయతీల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.  బీఆర్ఎస్​మద్దతుతో పోటీచేసిన అభ్యర్థులు సర్పంచ్​లుగా గెలిచినా ఏమి చేయలేరన్నారు.  

ఆయా సమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లేశ్​గౌడ్​, అధ్యక్షుడు బైరి శంకర్, రంజిత్​రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​, టౌన్ ప్రెసిడెంట్ బాసం గారి వెంకట్, నాయకులు విజయ్​, రాంచంద్రం, మార్కండేయులు, ప్రసాద్​, కాశీనాథ్​, మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.