యాదాద్రి/సూర్యాపేట, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏ వస్తువుకు ఎంత ఖర్చు పెట్టాలో ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు టీ, కాఫీ, బిర్యానీతో సహా మొత్తం 44 రకాల వస్తువులకు సంబంధించిన రేట్లను ఫిక్స్ చేస్తూ లిస్ట్ విడుదల చేసింది.
ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం... చిన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ. 1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ. 30 వేలు, మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ క్యాండిడేట్ రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ. 50 వేల వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి అయిన ఖర్చు వివరాలను ఈసీకి అందించాలి.
ఈ నేపథ్యంలో క్యాండిడేట్లు సభలు, సమావేశాల నిర్వహణకు చేయాల్సిన ఖర్చుతో పాటు ప్రచారంలో పాల్గొనే వారికి టీ, కాఫీ, టిఫిన్, భోజనాలు, ప్రచారంలో భాగంగా కొనుగోలు చేసే వస్తువులు, అద్దెకు తీసుకునే వస్తువులకు సంబంధించిన ధరలను ఈసీ ప్రకటించింది.
ఎన్నికల కమిషన్ టీ ఖర్చును రూ. 8గా నిర్ణయించగా, కాఫీ రూ. 10, పెద్ద సమోస రూ. 8, టిఫిన్ రూ. 35, లెమన్ రైస్ రూ. 20, భోజనం రూ. 80, చికెన్ బిర్యానీ రూ. 140, మటన్ బిర్యానీ రూ. 150, లీటర్ వాటర్ బాటిల్ రూ. 20, చిన్న వాటర్ బాటిల్‌కు రూ. 10 చొప్పున ఖర్చు చేయాలని సూచించింది. అలాగే ప్రచారానికి హాజరయ్యే కళాకారులకు ఒక్కొక్కరికి రూ. 400, బ్యాండ్ ఒక్కొక్కరికి రూ. 500, ఫొటోగ్రాఫర్ (రోజుకు) రూ. 1,500, వీడియోగ్రాఫర్ (రోజుకు) రూ. 1,800, డ్రోన్ కెమెరా (12 గంటలకు) రూ. 5,000, డీజే సింగిల్ పిన్‌కు రూ. 12 వేలు, ఎల్‌ఈడీ స్కీన్‌కు రూ. 9 వేలు, వాహనం (డీజిల్‌తో కలిపి 320 కిలోమీటర్ల వరకు) రూ. 2 వేలతో పాటు ఇతర సామగ్రి, హాళ్లు, అద్దెలకు సంబంధించిన ధరలతో కూడిన లిస్ట్‌ని రిలీజ్ చేసింది.
