‘గ్రానైట్‌‌’ గ్రామాల్లో ఎన్నికలు కాస్ట్‌‌లీ ! రూ. 50 లక్షలైనా ఖర్చు చేసేందుకు వెనుకాడని క్యాండిడేట్లు

‘గ్రానైట్‌‌’ గ్రామాల్లో ఎన్నికలు కాస్ట్‌‌లీ ! రూ. 50 లక్షలైనా ఖర్చు చేసేందుకు వెనుకాడని క్యాండిడేట్లు
  • కరీంనగర్‌‌ రూరల్‌‌, గంగాధర, కొత్తపల్లి మండలాల్లో పోటాపోటీ
  • రూ. 50 లక్షలైనా ఖర్చు చేసేందుకు వెనుకాడని క్యాండిడేట్లు
  • క్వారీలు, రియల్‌‌ బిజినెస్‌‌తో గ్రామాలకు కోట్లలో ఆదాయం
  • ఎట్లైన గెలవాల్సిందేనన్న లక్ష్యంతో ముమ్మర ప్రయత్నాలు

కరీంనగర్‌‌/గంగాధర, వెలుగు: కరీంనగర్‌‌ జిల్లాలో గ్రానైట్‌‌, రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం జోరుగా సాగుతున్న గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కాస్ట్‌‌లీగా మారాయి. క్వారీలు, రియల్‌‌ వ్యాపారం కారణంగా గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్‌‌ రూరల్‌‌ మండలాల్లోని పలు గ్రామాల ఆదాయం కోట్లలో ఉంటోంది. దీంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్‌‌ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు రూ. 50 లక్షలైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. 

ఓ వైపు క్వారీలు.. మరో వైపు రియల్‌‌ బిజినెస్‌‌
కరీంనగర్‌‌ జిల్లాలోని గంగాధర మండలం ఒద్యారం, గట్టుభూత్కూర్, చిన్న ఆచంపల్లి, పెద్ద ఆచంపల్లి, కోట్ల నర్సింహులపల్లి, ముప్పిడిపల్లి, కొత్తపల్లి మండలంలోని కమాన్‌‌పూర్‌‌, ఖాజీపూర్, ఎలగందల్, ఆసిఫ్‌‌నగర్‌‌, నాగులమల్యాల, బద్దిపల్లి గ్రామాల్లో భారీ సంఖ్యలో గ్రానైట్‌‌ క్వారీలు ఉన్నాయి. అలాగే గంగాధర మండలంలోని గంగాధర, గర్శకుర్తి, బూరుగుపల్లి, మధురానగర్, కరీంనగర్‌‌ రూరల్‌‌ మండలంలోని నగునూర్, మొగ్దుంపూర్‌‌ గ్రామాల్లో రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారం జోరుగా సాగుతుంది. 

దీంతో ఆయా గ్రామాలకు సీనరేజీ నిధుల కింద కోట్లలో ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఆయా గ్రామాల పాలకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు భారీ సంఖ్యలో ముందుకొచ్చారు. ఎలాగైనా సర్పంచ్‌‌ పదవి దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడం లేదు.

మొదలైన బుజ్జగింపులు
గంగాధర మండలంలోని ప్రతీ గ్రామంలో నలుగురి నుంచి 18 మంది వరకు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆర్థిక వనరులున్న గ్రామాలు కావడంతో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లోని కుల సంఘాల నాయకులను కలుస్తూ వారి సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న ఇండ్లకు వెళ్లి.. వారిని బుజ్జగిస్తూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అలాగే గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్‌‌ రూరల్‌‌ మండలాల్లోని అన్ని గ్రామాల్లో దావత్‌‌లు జోరందుకున్నాయి. సర్పంచ్‌‌, వార్డు పదవులకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఓటర్లను కలుస్తూ, దావత్‌‌లు ఏర్పాటు చేస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఎక్కడైనా పది మంది కలిస్తే చాలు .. వారికి కావాల్సిన సరంజామాను సమకూరుస్తున్నారు.

నామినేషన్‌‌ ఉపసంహరణకు లక్షలు..
కొత్త పంచాయతీరాజ్‌‌ చట్టం ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌‌కు కలిపి చెక్‌‌ పవర్‌‌ ఉండడం, తీర్మానాలు, నిధుల ఖర్చుతో పాటు పలు అవకాశాలు కల్పించడంతో ఉప సర్పంచ్‌‌ పదవి సైతం కీలకంగా మారింది. దీంతో సర్పంచ్‌‌ పదవితో సమానంగా ఉపసర్పంచ్‌‌ పదవికి అభ్యర్థులు నువ్వా.. నేనా.. అన్నట్లు పోటీపడుతున్నారు. దీంతో ఉపసర్పంచ్‌‌ కుర్చీపై కన్నేసిన క్యాండిడేట్లు తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నారు.

నామినేషన్‌‌ ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండడంతో.. తమకు పోటీ వస్తారని భావించిన క్యాండిడేట్లను బుజ్జగిస్తూ నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెప్పేందుకు సైతం సై అంటున్నారు.