సర్పంచ్‌‌ మీకు.. ఎంపీటీసీ మాకు !...రిజర్వేషన్లు కలిసి రాని గ్రామాల్లో కొత్త పొత్తులు

సర్పంచ్‌‌ మీకు.. ఎంపీటీసీ మాకు !...రిజర్వేషన్లు కలిసి రాని గ్రామాల్లో కొత్త పొత్తులు
  • ఒకరికొకరు సహకరించుకునేలా రహస్య ఒప్పందాలు
  • ఎన్నికల కోసం ఒక్కటవుతున్న ప్రత్యర్థులు

మంచిర్యాల, వెలుగు : ‘అన్నా... ఈ సారి నువ్‌‌ సుత సర్పంచ్‌‌గా పోటీ చేద్దామనుకున్నవ్‌‌.. గా సంగతి నాకూ తెలుసు.. కానీ ఏం చేస్తాం ! రిజర్వేషన్‌‌ నీకు కలిసి రాకపాయె. నాక్కూడా అనుకూలంగా వస్తదో రాదో అనుకున్న కానీ వచ్చింది. గందుకే ఓ విషయం చెబుదామని వచ్చిన... ఊళ్లె మనం మనం కొట్లాడుకుంటే ఎవరికీ వచ్చేదేం లేదు. పైగా రెంటికీ చెడ్డ రేవడి అయితది. ఇద్దరం కలిసి ఓ అండర్‌‌ స్టాండింగ్‌‌కు వద్దాం.. 

సర్పంచ్‌‌ ఎలక్షన్ల నాకు సపోర్ట్​జెయ్.. ఎంపీటీసీ ఎలక్షన్ల నిన్ను గెలిపించే బాధ్యత నాది.. నన్ను నమ్ము.. గీ సంగతి మనిద్దరి నడుమల్నే ఉండాలె’ అని ఓ నాయకుడు ప్రపోజల్‌‌ పెట్టగా.. ‘ఎట్లయినా మా పార్టీ క్యాండిడేట్‌‌ను గెలిపించాలని పైనుంచి ప్రెజర్‌‌ ఉన్నది.. అయినా సరే... నువ్వన్నట్టే నీకు సపోర్ట్​జేస్త.. పైనోళ్లకు ఏదోటి చెప్పుకుంట.. ఎంపీటీసీ రిజర్వేషన్​నాకు కలిసొస్తే మాత్రం మీ ఓట్లేయించాలె.. మళ్ల మాట తప్పవ్​ గదా ! గీ విషయం ఎక్కడా లీక్​ చేయనని ప్రామిస్‌‌ జెయ్‌‌’ అని మరో నాయకుడి ప్రతిపాదన. ఇది ఓ గ్రామానికి చెందిన ఇద్దరు లీడర్ల మధ్య జరిగిన ఒప్పందం. 

పంచాయతీ ఎన్నికల వేళ చాలా గ్రామాల్లో ఇలాంటి రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. సర్పంచ్‌‌ రిజర్వేషన్‌‌  అనుకూలంగా వచ్చిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తూ.. రిజర్వేషన్‌‌ కలిసి రాని లీడర్ల మద్దతు కోసం వెంటపడుతున్నారు. ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్​ చేస్తే వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో తాను సపోర్ట్‌‌ చేస్తానంటూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. 

రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్‌‌గా పోటీ చేసే అవకాశం రానివారు ఎంపీటీసీ చాన్స్‌‌ కోసం ఈ ప్రపోజల్స్‌‌కు సై అంటున్నారు. అలాగే ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు నలుగురు క్యాండిడేట్లు పోటీ చేస్తున్న దగ్గర సైతం అంతర్గత చర్చలు జరుపుతున్నారు. కొన్ని చోట్ల డబ్బులు కూడా ఆఫర్‌‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పార్టీలు వీక్‌‌ ఉన్న చోట..

రిజర్వేషన్లు కలిసి రాని చోటనే కాకుండా పార్టీలు వీక్‌‌గా ఉన్న గ్రామాల్లో సైతం లీడర్లు ఒకరికొకరు సపోర్ట్‌‌ చేసుకోవాలని రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ వీక్‌‌ ఉన్న చోట కాంగ్రెస్‌‌కు, బీజేపీ బలహీనంగా ఉన్న దగ్గర బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌కు మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారు. ఒకే పార్టీలో గ్రూపులు ఉన్నచోట ఓ వర్గం లీడర్‌‌ సర్పంచ్‌‌గా పోటీలో ఉంటే మరో వర్గం నాయకుడు ఇంకో పార్టీకి సపోర్ట్‌‌ చేస్తున్నాడు. 

ఓ గ్రామంలో అధికార కాంగ్రెస్‌‌ నుంచి ఇద్దరు సమ ఉజ్జీలు నామినేషన్‌‌ వేయడంతో ఒకరు బీఆర్‌‌ఎస్‌‌ మద్దతు కోసం, మరొకరు బీజేపీ సపోర్ట్‌‌ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఆ రెండు పార్టీల్లో రిజర్వేషన్‌‌ అనుకూలించని లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇలా గ్రామాల్లో రాజకీయ లబ్దికోసం నాయకులు పార్టీలకతీతంగా ఏకమవుతుండడం విశేషం. 

ఒక్కటవుతున్న ప్రత్యర్థులు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇంతకాలం ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లుసైతం ఒక్కటవుతున్నారు. ఫస్ట్​ ఫేజ్‌‌ ఎలక్షన్లు జరుగుతున్న ఓ మండలంలోని మేజర్‌‌ గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు లీడర్లు సర్పంచ్‌‌ పదవి కోసం విభేదాలను పక్కనపెట్టి ఏకమయ్యారు. ‘నీకు సర్పంచ్‌‌ ఎన్నికల్లో నేను సపోర్ట్ జేస్త.. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్‌‌ కలిసొస్తే నువ్‌‌ నాకు సపోర్ట్‌‌ జేయాలె’ అనే ఒప్పందంపై ఇటీవలే ఇద్దరూ కలిసి పార్టీ కూడా మారారు.