పల్లెల్లో ఇక ప్రత్యేక పాలన!.. ఎంపీ ఎన్నికల తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు

పల్లెల్లో ఇక ప్రత్యేక పాలన!..  ఎంపీ ఎన్నికల తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు

 

  • వారం రోజుల్లో ముగియనున్న సర్పంచుల పదవీకాలం
  • ఎంపీ ఎన్నికల తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు  
  • అప్పటిదాకా స్పెషల్​ ఆఫీసర్లే 

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం వారం రోజుల్లో ముగియనుంది. పంచాయతీలకు 2019లో ఎన్నికలు నిర్వహించగా.. 1 ఫిబ్రవరి 2024తో వారి టర్మ్​ ముగుస్తున్నది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేయకపోవడం చూస్తుంటే.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఎన్నికల నిర్వహణ వరకు ప్రత్యేక అధికారుల పాలన తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలి. రాష్ట్రంలోకాంగ్రెస్​కొత్తగా అధికారం చేపట్టడం, పాలనాపరమైన వ్యవహారాలను చక్కదిద్దడంపై సర్కారు దృష్టి పెట్టడం, మరో వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే  అవకాశం కనిపించడం లేదు. దీంతో స్పెషల్​ఫీసర్ల పాలన విధిస్తూ రెండు మూడు రోజుల్లో ఆదేశాలు రావచ్చని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. 

ఆఫీసర్ల జాబితా రెడీ

రాష్ట్రంలో12,769 పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి ఒకటితో పదవీకాలం ముగుస్తుండటంతో తమ టర్మ్​ను పొడిగించాలని, లేదంటే  ఆరు నెలల పాటు తమకే ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు వారు సర్కారు పెద్దలకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అయితే కొత్త చట్టం ప్రకారం పాత పాలకవర్గాలను కొనసాగించాలంటే అసెంబ్లీలో చట్ట సవరణ చేయాల్సిఉంటుందని, కాబట్టి పాత వారిని కొనసాగించే చాన్స్​లేదని తెలుస్తున్నది. వచ్చే నెల పార్లమెంట్​ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నందున సాధారణ ఎన్నికల తర్వాతే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే పంచాయతీలకు వివిధ శాఖల అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే పంచాయతీ అధికారుల నుంచి మండలాల వారీగా ఆఫీసర్ల లిస్ట్​లు తెప్పించుకున్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏవో, ఎంఈవో, ఆర్ డబ్ల్యూఎస్, ఆర్అండ్​బీ, మిషన్ భగీరథ, ఐసీడీఏస్ ఇంజనీర్లు, వైద్యశాఖ అధికారులు, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్లకు స్పెషల్​ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు.  2013లోనూ ఉమ్మడి రాష్ట్రంలో  ఏడాది పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది.  

ఇంకా ఆదేశాలు రాలేదు

పంచాయతీల పాలకవర్గాల  పదవీకాలం  ఫిబ్రవరి 1తో ముగియనుంది. ప్రత్యేక అధికారుల పాలనపై ఇప్పటికైతే ఎలాంటి ఆదేశాలు రాలేదు. మరో రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రత్యేక అధికారుల నియామకానికి  సంబంధించి ఏర్పాట్లు చేశాం.  
-
 శ్రీనివాస్, డీపీవో, ఆదిలాబాద్​