కాంగ్రెస్‌‌లో ముదిరిన పంచాయితీ

కాంగ్రెస్‌‌లో ముదిరిన పంచాయితీ
  • మాణిక్కం ఠాగూర్‌‌‌‌కు 13 మంది రిజైన్ లెటర్
  • రేవంత్ మీటింగ్‌‌కు హాజరుకాని సీనియర్లు
  • ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’పై ఇందిరా భవన్‌‌లో సమీక్ష
  • కొంతమందిలో అసంతృప్తి ఉండొచ్చు.. 
  • అధిష్టానం చూసుకుంటది: పీసీసీ చీఫ్
  • మా మధ్య విభేదాలు లేవు.. కలిసే ఉన్నాం: జానారెడ్డి
  • సీనియర్ల వైఖరి వల్లే రాజీనామాలు: సీతక్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్‌‌లో పాత, కొత్త నేతల పంచాయితీ ముదిరింది. పీసీసీ కమిటీల్లో పదవులన్నింటినీ రేవంత్ రెడ్డి తన వర్గానికే ఇప్పించుకున్నారనే విమర్శల నేపథ్యంలో.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌‌లో చేరిన నేతలు కమిటీల్లోని తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్‌‌ మాణిక్కం ఠాగూర్‌‌‌‌కు 13 మంది నేతలందరూ కలిసి రిజైన్‌‌ లెటర్ పంపారు. ఆదివారం ఇందిరాభవన్‌‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సీనియర్లు గైర్హాజరయ్యారు. శనివారం చెప్పిన విధంగానే ఈ మీటింగ్‌‌ను బహిష్కరించారు. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావేద్, సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, నాగం జనార్దన్ రెడ్డి, అంజన్​కుమార్ యాదవ్ తదితరులు మాత్రం హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత రేవంత్‌‌‌‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 20 నుంచి జిల్లాల్లో ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ భేటీలు హాత్ సే హాత్ జోడో అభియాన్ రాష్ట్ర స్థాయి మీటింగ్‌‌‌‌ని ఈ నెల 19 లోపు ముగించాలని ఏఐసీసీ చెప్పిందని, అందులో భాగంగా సమావేశం జరుపుతున్నామని రేవంత్ తెలిపారు. జిల్లా స్థాయిలో ఈ నెల 20 నుంచి 24 వరకు నిర్వహించి, నివేదికలను పీసీసీకి పంపాలని ఆదేశించారు. బ్లాక్ స్థాయి సమావేశాలు ఈనెల 26 నుంచి 29 వరకూ నిర్వహిస్తామన్నారు. తర్వాతి దశలో మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జనవరి 26న కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో రాహుల్ పాదయాత్ర ముగిసే నాటికి ఈ కార్యక్రమం గ్రామ స్థాయిలోకి వెళ్లాలన్నారు. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రచారంలో ధరణి సమస్యలు ప్రస్థావించాలని, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ గురించి వివరించి చెప్పాలన్నారు.

జనవరి 26 నుంచి పాదయాత్ర

రాష్ట్రంలో జనవరి 26 నుంచి పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తామని రేవంత్‌‌‌‌ ప్రకటించారు. ప్రజల జీవితాల్లో, పరిపాలనలో మార్పు కోసం ‘యాత్ర ఫర్ చేంజ్’ కార్యక్రమాన్ని పార్టీ చేపడుతున్నదని చెప్పారు. ఆలోపే జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ యాత్ర ద్వారా భారత్ జోడో యాత్రలో రాహుల్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తామని తెలిపారు. మోడీ, కేసీఆర్ చేసిన మోసాలను చార్జ్ షీట్ల రూపంలో ఇంటింటికీ అందజేస్తామన్నారు. పార్టీలో సీనియర్ల తిరుగుబాటుపైనా రేవంత్ స్పందించారు. హైకమాండ్ తనకు ఓ అవకాశం ఇచ్చిందని, తన సర్వశక్తులను పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నానని అన్నారు. కొంతమందిలో అసంతృప్తి, కోపం ఉండొచ్చని.. అవన్నీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. తన సహచరులకు ఏమైనా అపోహలు ఉంటే.. తానే స్వయంగా వారితో మాట్లాడుతానన్నారు. 

రియల్ ఎస్టేట్ బ్రోకర్‌‌‌‌‌‌‌‌లా సీపీ వ్యవహరిస్తుండు

ఎంపీ ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై సోషల్ మీడియా పోస్టుల విషయాన్ని సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. పోస్టులు ఎవరు పెట్టారో, ఎక్కడి నుంచి పెట్టారో ఆధారాలు చూపించాలన్నారు. పోస్టుల విషయాన్ని ఉత్తమ్‌‌‌‌కు చెవిలో చెప్పే బదులు, ఉత్తమ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఉత్తమ్ ఫిర్యాదు కాపీ సీవీ ఆనంద్‌‌‌‌ దగ్గరే ఉందని, ఇప్పటికైనా కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మెప్పు పొంది, డీజీపీ అయ్యేందుకు సీవీ ఆనంద్‌‌‌‌ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నాడని, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీరుగా ఆయన వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వార్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌పై దాడి చేసి, తమ మేధో సంపత్తిని పోలీసులు దోచుకుపోయారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్‌‌‌‌గా తీసుకుందన్నారు. వార్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌లోని ఐఐటీ, ఐఐఎం నిపుణులను పోలీసులు బట్టలిప్పి కూర్చోబెట్టారని, మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. 

భిన్నాభిప్రాయాలు సహజమే: నదీం జావేద్

కాంగ్రెస్​లో ప్రజాస్వామ్యం ఉందని, భిన్నాభిప్రాయాలు సహజమేనని ఏఐసీసీ సెక్రటరీ నదీం జావేద్ అన్నారు. పార్టీ పదవుల విషయంలో అసంతృప్తి ఉండడం కొత్తేమీ కాదన్నారు. ఇందిరాభవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తామంతా రాబోయే ఎన్నికల్లో కలిసే పనిచేస్తామని.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌, బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతామని చెప్పారు. ప్రస్తుత పరిణామాలను హైకమాండ్ చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో బలపడుతున్నపుడు కొందరు సీనియర్లు ఉద్దేశపూర్వకంగా వీక్ చేస్తున్నారని మాజీ విప్ ఈరవత్రి అనిల్ కుమార్ విమర్శించారు. గాంధీభవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఏకతాటిపైకి తీసుకొస్తం: జానారెడ్డి

పార్టీలో అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని, రాహుల్​ని చూసి ఇది నేర్చుకోవాలని జానారెడ్డి సూచించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అందుకే ఎవరినీ గాయపరచకుండా జాగ్రత్త వహించాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. తమకు పార్టీ పదవులు అవసరం లేదని, కాంగ్రెస్‌‌‌‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. నేతలను మానసికంగా దెబ్బ తీసే మాటలు ఎవరూ మాట్లాడవద్దని కోరారు. కాగా, సమావేశం తర్వాత మీడియాతో జానారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌ను ఏకతాటిపైకి తీసుకువస్తామని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. సీనియర్ల మధ్య ఎదురైన గ్యాప్‌‌‌‌ను పూడుస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.

రాజీనామా చేసిన నాయకులు వీరే

పీసీసీ పదవులకు రాజీనామా చేస్తూ లేఖ పంపిన వారిలో సీతక్క, వేం నరేందర్ రెడ్డి, సీహెచ్ విజయ రమణారావు, దొమ్మాటి సాంబయ్య, కవ్వంపల్లి సత్యనారా యణ, వజ్రేశ్ యాదవ్, సుభాష్ రెడ్డి, చారగొండ వెంకటేశ్, పటేల్ రమేశ్‌‌ రెడ్డి, సత్తు మల్లేశ్, చిలుక మధు సూదన్ రెడ్డి, శశికళా యాదవ రెడ్డి, జంగయ్య యాదవ్ ఉన్నారు. తాము పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడుతున్నా మని, అంతేతప్ప తమకు పదవులు ముఖ్యం కాదని ఠాగూర్‌‌‌‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు.