జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చంటున్న న్యాయనిపుణులు

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చంటున్న న్యాయనిపుణులు

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 1100 మంది జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇండ్ల స్థలాలు పొందేందుకు.. జవహర్​లాల్​ నెహ్రూ జర్నలిస్టుల సహకార హౌసింగ్ సొసైటీ ( జేఎన్ జేహెచ్ఎస్) 2008లో ఏర్పాటు చేసుకున్నారు.  జేఎన్​జేహెచ్ఎస్​ను  ఎమ్మెల్యేలు,  ఎంపీలు,  అఖిల భారత సర్వీసు ఉద్యోగుల  సొసైటీలలో కలిపి జీఓ ఇవ్వడం వల్ల జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

జేఎన్​జేహెచ్ఎస్ ఏర్పాటుకు ముందుతరాల  జర్నలిస్టులకు కాంగ్రెస్  ప్రభుత్వం మూడు పర్యాయాలు (బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గోపనపల్లి) స్థలాలు ఇచ్చింది.  వారికి ఎలాంటి సమస్య రాలేదు.  బంజారాహిల్స్​లో మొదటిసారి,  జూబ్లీహిల్స్​లో  రెండోసారి,  గోపనపల్లిలో మూడోసారి జర్నలిస్టులకు  ఇండ్ల స్థలాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది.  సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని చాలాసార్లు గుర్తుచేశారు.  జేఎన్​జేహెచ్ఎస్​కు తాను ఇండ్ల స్థలాలను ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

గ త బీఆర్ఎస్  ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ    2023లో  జేఎన్​జేహెచ్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారు.  2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే   ఇండ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికలకంటే ముందు ఆయన ప్రకటించారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత   08– -09-– 2024 రోజు రవీంద్రభారతిలో  ప్రభుత్వం తరఫున బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి  జేఎన్​జేహెచ్ఎస్​కు  ఇండ్ల స్థలాలను  అందిచేందుకు  ‘మెమో’ అందించారు.  కానీ,  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండ్ల  స్థలాలకు సంబంధించిన భూమిని స్వాధీనం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగానే ఆటంకం ఏర్పడ్డది.   

జేఎన్​జేహెచ్ఎస్ తోపాటు ఇతర సొసైటీలకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో ప్రభుత్వం జారీ చేసిన జీఓలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఏడాది క్రితమే ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జర్నలిస్టులకు  స్థలాలు ఇవ్వవచ్చని న్యాయ నిపుణుడు వేదుల వెంకటరమణ తదితరులు స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

సమస్యకు కారణం

అఖిల భారత సర్వీసు ఉద్యోగులు,  ఎమ్మెల్యేలు,  ఎంపీల  సొసైటీలతో  జర్నలిస్టుల హౌసింగ్​ సొసైటీని కలిపి ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంలో సమస్య ఏర్పడ్డది.  లక్షల రూపాయల్లో వేతనాలు, పింఛన్లు, టీఏలు, డీఏలు,  వాహన సౌకర్యం  కలిగి ఉండటం,  ప్రొటోకాల్ ప్రకారం అన్ని వసతులు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు జర్నలిస్టులు ఏ విధంగానూ సమానం కారు.  

అందరికీ కలిపి ప్రభుత్వం  జారీ చేసిన జీఓలను  చాలెంజ్ చేస్తూ డాక్టర్ రావు  విబిజె  చెలకాని,  ఎస్. జీవన్ కుమార్  తదితరులు హైకోర్టులో  పిటీషన్  వేశారు.  జర్నలిస్టులకు  స్థలాలు ఇవ్వకూడదన్నది తమ ఉద్దేశం కాదని,  పిటీషన్  వేసిన చెలికాని,  జీవన్ కుమార్ తదితరులు  స్పష్టం  చేశారు.  ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత ఉద్యోగులకు ఇండ్ల  స్థలాలు కేటాయించడాన్ని  తాము వ్యతిరేకిస్తున్నామని పిటీషన్  వేసినవారు స్పష్టంగా చెబుతున్నారు.  

పిటీషన్ ను పరిశీలించిన  హైకోర్టు  జర్నలిస్టుల  పట్ల  సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.  జర్నలిస్టులు  అఫిడవిట్లు  ఇచ్చి ఇండ్ల స్థలాలు తీసుకోవచ్చని జస్టిస్  నూతి  రాంమోహన్ రావు,  జస్టిస్  సీవీ. నాగార్జునరెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ 05-– 01-– 2010న  తీర్పు చెప్పింది.  

హైకోర్టు ఆదేశాలను చాలెంజ్  చేస్తూ ఎఐఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడిన సొసైటీలు సుప్రీంకోర్టులో  పిటీషన్ దాఖలు చేయడంతో జర్నలిస్టులకు సమస్యలు ఏర్పడ్డాయి.  జర్నలిస్టుల పట్ల సానుకూలంగా తీర్పు చెప్పిన హైకోర్టు తరహాలోనే  సుప్రీంకోర్టు కూడా రెండు పర్యాయాలు తీర్పులు ఇవ్వడం గమనార్హం.

ఇండ్ల స్థలాలు పంపిణీ చేయని బీఆర్ఎస్​ 

జర్నలిస్టులకు ప్రభుత్వం 2008లో కేటాయించిన భూమిని జేఎన్​జేహెచ్ఎస్​కు  అప్పగించాలని జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్లతో కూడిన  సుప్రీంకోర్టు డివిజన్  బెంచ్ 02– -05-– 2017న తీర్పు చెప్పింది. అయినప్పటికీ  ఆనాటి  టీఆర్ఎస్   ప్రభుత్వం  జర్నలిస్టులకు భూములు అప్పగించలేదు.  జేఎన్​జేహెచ్ఎస్  సభ్యులు  తమకు  కేటాయించిన  భూముల్లో  ప్లాట్లు చేసుకుని ఇండ్లు కూడా కట్టుకోవచ్చని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్.వి. రమణ,  జస్టిస్  హిమాకోహ్లి,  జస్టిస్  సి.టి. రవి కుమార్​లతో  కూడిన  త్రిసభ్య  ధర్మాసనం 25– -08–-2022 రోజు తీర్పు చెప్పింది.  ఈ తీర్పును  కూడా టీఆర్ఎస్  ప్రభుత్వం అమలు చేయలేదు. 

న్యాయ నిపుణుల సూచనలు

జేఎన్​జేహెచ్ఎస్​కు  ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు  తమ ప్రభుత్వం  సానుకూలంగా ఉందని న్యాయ నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటుందని సీఎం  రేవంత్ రెడ్డి స్పష్టంగా అనేకసార్లు చెప్పారు.  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దని హైకోర్టు కాని, సుప్రీంకోర్టు కాని ఎక్కడా చెప్పలేదని  న్యాయ నిపుణులు స్పష్టం చేశారు.  సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ 24న తీర్పును దృష్టిలో ఉంచుకుని న్యాయ నిపుణులు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి. 

1. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపును  హైకోర్టు కాని,  సుప్రీంకోర్టు కాని తప్పు పట్టలేదు.  2. దరఖాస్తు చేసే సమయానికి ఇండ్లు, ఇంటి స్థలాలు లేనివారికి స్థలాలు ఇవ్వొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.  
3. జర్నలిస్టులకు స్థలాలు  ఇవ్వవద్దని హైకోర్టుకాని,  సుప్రీంకోర్టు కాని చెప్పలేదు.  

4.  కొన్ని నియమ, నిబంధనలకు లోబడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వవచ్చని హైకోర్టు,  సుప్రీంకోర్టు చెబుతూ ప్రభుత్వానికి అధికారం ఇచ్చాయి. 5. జర్నలిస్టు సొసైటీని ఇతర సొసైటీలలో కలపకుండా ఉత్తర్వులు జారీ చేయాలి. 

 6. ఇండ్ల స్థలాలు కేటాయింపునకు అర్హత నిర్ణయించేందుకు  స్క్రూటినీ కమిటీని నియమించాలి.  7. ఫోర్త్ ఎస్టేట్ గా పరిగణిస్తున్న  జర్నలిస్టులకు సంక్షేమం కింద భారత రాజ్యాంగం ఆర్టికల్ 298  ప్రకారం స్థలాలు ఇవ్వవచ్చు.  

8.  సుప్రీంకోర్టు 25-–11-– 2024 రోజు ఇచ్చిన తీర్పులోని  92, 95 పేరాలకు లోబడి స్క్రూటినీ కమిటీ, ధరల నిర్ణాయక కమిటీలను వేసి ఇండ్ల స్థలాలను ఇవ్వవచ్చు. 

9. నిజాంపేట, పేట్ బషీర్​బాద్​లోనే  70  ఎకరాలు ఇవ్వాలి.  ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి.  న్యాయపరమైన ఈ సూచనల మేరకు  ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తే  మళ్లీ ఎవరూ కోర్టుల్లో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్​) వేసేందుకు వీలుండదు.

అందరి మద్దతు

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న విషయంలో అన్ని రాజకీయ పార్టీలు,  ప్రజాసంఘాలు సుముఖంగానే ఉన్నాయి.  సీఎం  రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,  రెవెన్యూ మంత్రి పి. శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్ర మంత్రులు కూడా జర్నలిస్టులకు  ఇండ్ల  స్థలాలు ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నట్టు స్పష్టం అవుతోంది.  ఈ కారణంగానే  జర్నలిస్టులు ఈ విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు  చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం కోసం  జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారు.

- పి.వి. రమణారావు,సీనియర్ జర్నలిస్ట్