రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ బోర్డు ఉన్నా దాని పని అంతంత మాత్రమే. పీసీబీ చైర్మన్ పదవికి నిష్ణాతులు, విషయ పరిజ్ఞానం కలిగిన అధికారిని నియమించక పోవడం, పీసీబీ మెంబర్ సెక్రటరీకి శాస్త్ర సాంకేతిక రంగాలలో అలాగే మెనేజ్‌మెంటులో నిష్ణాతులైనవారిని నియమించకపోవడం జరుగుతున్నది. సుప్రీంకోర్టు పీసీబీ చైర్‌పర్సన్ మెంబర్ సెక్రటరీ నియామక సంబంధిత విషయాలలో నిష్ణాతులైనవారినే నియమించాలని చెప్పినా అమలుకావడం లేదు. ఇక పీసీబీలో కావలసిన ఉద్యోగస్తులను భర్తీ చేయకపోవడంతో పీసీబీ రాష్ట్రంలో వాతావరణ కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికట్టలేకపోతోంది.
భారతదేశం నడిబొడ్డున డక్కన్ పీఠభూమిపై హైదరాబాద్ ఏర్పడ్డది. సమశీతోష్ణస్థితితో నివసించడానికి చాలా అనువుగా ఉన్న నగరం ఇది. చార్మినార్, గోల్కొండ, చౌమొల్లప్యాలెస్, కుతుబ్‌షాహి టూంబ్స్, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి కట్టడాలతో హైదరాబాద్ నగరంలో రాజసం ఉట్టిపడుతోంది.
అన్ని రాష్ట్రాల భాషలు, వంటకాలకు హైదరాబాద్ నిలయం. శాంతిభద్రతలు, సమశీతోష్ణస్థితి, స్నేహపూరిత వాతావరణాన్ని చూసి చాలామంది ముఖ్యంగా ఉత్తర భారతదేశ విశ్రాంత ఉద్యోగులు, వర్తకులు హైదరాబాద్నగరాన్ని తమ నివాసయోగ్యమైన నగరంగా ఎంచుకున్నారు. అయితే, ఇదంతా పాతమాట. గత 20 సంవత్సరాలలో పరిస్థితులు మారాయి.
ఇప్పుడు హైదరాబాద్‌లో ఇరుకు, గతుకుల రోడ్లు, ట్రాఫిక్ జామ్‌లు, పొంగిపోర్లుతున్న డ్రైనేజీ, గాలి, నీటి కాలుష్యం, ట్యాంక్‌బండ్, మూసీ నుంచి వచ్చే కంపుతో నగర పూర్వ వైభవం మసకబారిపోతోంది.
వాతావరణ కాలుష్యం
వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలైన పరిశ్రమల నుంచి, అలాగే వాహనాల నుంచి వచ్చే పొగ, మున్సిపల్ చెత్తను ఖాళీ ప్రదేశాలలో కాల్చడం, నగరం చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడంవంటి వాటిపై కఠిన చర్యలు లేవు. వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రజలకు అవగాహన సహకారం తీసుకోవడంలో పీసీబీ పూర్తి వైఫల్యం కనిపిస్తోంది.
వాహన కాలుష్యం
ఇరుకు గుంతల రోడ్లతో వాహనాలు మెల్లగా పోవడంతో పొగ అధికంగా వెలువడుతున్నది. అదీకాక వాహనదారులు నడుంనొప్పి వంటి వాటితో బాధపడుతున్నారు. జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ల విహారయాత్రలకు డబ్బు ఉంది కాని, రోడ్లపై గుంతలు పూడ్చడానికి డబ్బు లేదు. ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలు హర్షణీయమే.
అయితే, ఇక 15 సంవత్సరాలు పైబడిన ఆటోలు, ట్రక్కులు వంటివి విపరీతమైన పొగ వదులుతున్నాయి. ఈ విషయంలో రవాణాశాఖ కూడా చర్యలు తీసుకోవాలి. నగరంలోని కంకర రోడ్లు అన్నింటిని బ్లాక్ టాప్ రోడ్లుగా మార్చడం అలాగే భవన నిర్మాణంలో వచ్చే దుమ్ము, ధూళిని నియంత్రించడం జరగాలి. నగరం చుట్టుపక్కల గల స్టోన్ క్రషర్స్ నుంచి కూడా కాలుష్యమవుతోంది.
దీనిని కూడా కంట్రోల్ చేయుటకు తగిన చర్యలు గైకొనాలి. దేశ రాజధాని ఢిల్లీలో రకరకాల కారణాలతో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదముంది. అట్టి పరిస్థితి హైదరాబాద్ నగరానికి రాకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి.
పరిశ్రమల కాలుష్యం
ఇక జల కాలుష్యం కూడా నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొన్ని సందర్భాలలో మంచినీటి డ్రైనేజీ పైపులు పక్కపక్కనే ఉండి లీకేజీలతో తాగునీరు కలుషితమవుతోంది. ఈ మధ్య ఇండోర్ పట్టణంలో కలుషితమైన నీరు తాగి 15 మంది చనిపోవడం వందమంది వరకు ఆసుపత్రి పాలవడం వంటి దుర్ఘటనలు హైదరాబాద్ నగరానికి పట్టకుండా ఉండాలి.
చాలా ప్రాంతాలలో కలుషిత నీటిపై సంబంధిత అధికారుల చర్యలు అంతంత మాత్రమే. ఇప్పటికైనా పాత పైపులన్నీ మార్చవలసిన అవసరముంది. ట్యాంక్‌బండ్ శుద్ధి చేయడానికి జైకా నుంచి అప్పు తీసుకొని పనులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కూకట్‌పల్లి నాలా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రసాయనాలతో కూడిన నీటిని ట్యాంక్‌బండ్‌లో నింపడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
అలాగే కాటేదాన్ ప్రాంతంలో ఉన్న రసాయన ఫ్యాక్టరీలు, తమ వ్యర్థాలను మూసీనదిలో వదలడం వలన మూసీ కలుషితమై రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలపై, అలాగే వారు వేసే పంటలపై ప్రభావం చూపుతోంది. బాలానగర్‌లో కెమికల్ ఇండస్ట్రీని పూర్తిగా మూసివేయవలసిన అవసరముంది. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని ప్రకటన చేసినా పనిపూర్తి కాలేదు.
నోటీసులు ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం మూసీనది ప్రక్షాళన, సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయం. అయితే మొదటగా ప్రక్షాళన యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. హైదరాబాద్‌ను ‘కాలుష్య ఢిల్లీ’ కాకముందే అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరుతోంది.
- యం. పద్మనాభరెడ్డి,అధ్యక్షుడు,ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
