- రెండు రోజుల్లోరిజర్వేషన్లు ఫైనల్
- ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక
- 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు
- 2024 సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు
- నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి గైడ్‌లైన్స్‌తో జీవో?
- రేపు ఓటరు తుది జాబితా విడుదల
- డిసెంబర్ 10 నుంచి 20 మధ్య 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే చాన్స్
హైదరాబాద్, వెలుగు:పల్లెల్లో ఎన్నికల హీట్ మొదలైంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స్పీడ్ అందుకోగా.. ఏ గ్రామం ఎవరికి రిజర్వు అవుతుందోనని ఉత్కంఠ నెలకొన్నది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పటికే జిల్లాలకు చేరడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ జాబితాలు తయారవుతున్నాయి. ఏ ఊరు ఎవరికి అనేది మరో రెండురోజుల్లో తేలిపోనున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా.. ఏ నలుగురు కలిసినా.. తమ ఊరి రిజర్వేషన్లపైనే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు దక్కే స్థానాలపై జోరుగా చర్చ సాగుతున్నది.
కాగా, పాత పద్ధతిలో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ సారి రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేయనుండటంతో గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి.అంటే గతంలో ఆ గ్రామ సర్పంచ్పదవి బీసీకి రిజర్వ్అయితే ఈ సారి ఆ వర్గానికి అవకాశం ఉండదు. దీంతో గ్రామాల్లో సర్పంచ్ స్థానం ఏ సామాజిక వర్గాని కి దక్కుతుందోనని ప్రజలు, ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
26 లేదా 27న ఎన్నికల షెడ్యూల్!
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24న హైకోర్టులో కేసు విచారణకు రానున్నది. మరుసటి రోజు 25న కేబినెట్ సమావేశం ఉంటుంది. తర్వాత 26 లేదంటే 27న ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. ఈ లోగా ఓటరు జాబితా ముసాయిదా, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు రావడంతో ఆ దిశగా పనిచేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు పీఆర్, పోలీసుశాఖ ఉన్నతాధికారులు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటిలో మౌలిక వసతులు, బ్యాలెట్ బాక్సులు, సిబ్బం ది నియామకం, శిక్షణ అంశాలపై ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిపై చర్చించారు. ఎక్కువ మంది మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. దీంతో ఎన్నికల సంఘం కూడా 3 విడత ల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏయే తేదీల్లో ఎన్నికలు జరపాలనేదానిపై ప్రణాళిక సిద్ధం చేసింది.
23న పీఆర్ కమిషనరేట్‌కు రిజర్వేషన్ల రిపోర్ట్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటరు జాబితా సవరణ, మార్పులు చేర్పులు, వార్డుల విభజన కొలిక్కి రాగా.. పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర పనులు వేగవంతమయ్యాయి. మరోవైపు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక పంచాయతీరాజ్ శాఖ నుం చి కలెక్టర్లకు చేరింది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజ ర్వేషన్ల ఖరారుపై కసరత్తు మొదలుపెట్టారు. రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. 23వ తేదీ వరకు రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను పంచా యతీరాజ్ కమిషనరేట్‌కు పంపించాలని జిల్లాల ఎన్నికల అధికారులకు డెడ్‌లైన్ విధించారు.
దీంతో కలెక్టర్ల పర్యవేక్షణలో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియను అనుకున్న సమయానికి పూర్తి చేసేలా జెట్‌స్పీడ్‌తో పనిచేస్తున్నారు. గ్రామాలవారీగా రిజర్వేషన్ల రిపోర్ట్‌ను కలెక్టర్లకు చేరిన వెంటనే.. పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు పంపించనున్నారు. అక్కడ స్క్రూటినీ పూర్తయిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేపు ఓటరు తుది జాబితా విడుదల
గ్రామ పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని, గతంలో ప్రచురించిన జాబితాలోని లోపా లను వెంటనే సరిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో) ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది. 2025 జులై 1 అర్హత తేదీగా.. అసెంబ్లీ ఓటర్ల జాబి తా ఆధారంగా.. గత సెప్టెంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు. అందులో ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని కమిషన్ స్పష్టం చేసింది. 22వ తేదీన వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను డీపీవోలు పరిష్కరించాలి. సవరణలు పూర్తయిన తర్వాత వార్డుల వారీగా మార్పులతోకూడిన ఫైనల్ ఫొటో ఓటర్ల జాబితా 23న ప్రచురించనున్నారు. ఓటర్ల సంఖ్యలో మార్పులకు తగ్గట్టు గా పోలింగ్ స్టేషన్ల జాబితా రీ-పబ్లికేషన్ చేయనున్నారు.
నేడు పంచాయతీరాజ్ శాఖ నుంచి జీవో
గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లకు సంబం ధించి పంచాయతీరాజ్ శాఖ శనివారం గైడ్‌లైన్స్‌తో కూడిన జీవోను జారీ చేయనున్నట్టు తెలిసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదకకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. మంత్రులందరికీ ఫైలు పంపించి, ఆమోదిస్తున్నట్లు సంతకాలు
తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రిజ ర్వేషన్లపై శనివారం జీవో వెలువడనున్నట్టు పంచాయతీరాజ్‌శాఖలో ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు చెప్పారు.
12,733 పంచాయతీలకు ఎన్నికలు..
మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 10 నుంచి 20 మధ్య మూడు రోజుల వ్యవధిలో మూడు దశల్లో సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగ నున్నాయి. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మా ఊరు ఎవరికి?
తమ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనేదానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లను, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సర్పంచ్ స్థానాలకు ఆర్డీవోలు, వార్డులకు ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఫైనల్ చేస్తారు. ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ నెల 23 నాటికి ఏ ఊరు.. ఏ వర్గానికి రిజర్వు అయిందనే విషయంలో క్లారిటీ రానున్నది. అయితే, ఈ సారి ఎన్నికల్లో ‘రొటేషన్’ విధానం.. సిట్టింగ్ మాజీ సర్పంచ్‌ల ఆశలపై నీళ్లు చల్లింది. గతంలో ఒక సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి.. ఈసారి మారనున్నది. దీంతో పాత రిజర్వేషన్ ప్రకారం గెలిచినవారు, ఈ సారి పోటీకి దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు తమ సామాజిక వర్గానికి సీటు రావాలని కొత్తవారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
