ఒక్కరోజు డ్యూటీకి రాకున్నాపంచాయతీ కార్యదర్శులు డిస్మిస్..

ఒక్కరోజు డ్యూటీకి రాకున్నాపంచాయతీ కార్యదర్శులు డిస్మిస్..
  • అగ్రిమెంట్ ను ఆసరాగా చేసుకుని అధికారుల ఇష్టారాజ్యం
  • రోజుకు 12 నుంచి 14 గంటలపాటు చాకిరీ
  • తీవ్ర పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న పంచాయతీ సెక్రటరీలు
  • మహబూబాబాద్ జిల్లాలో ఒకే రోజు 9 మంది తొలగింపు
  • కలెక్టరేట్​ను ముట్టడించిన కార్యదర్శులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
  • తన నిర్ణయంపై వెనక్కి తగ్గిన కలెక్టర్.. 9 మంది తిరిగి డ్యూటీలోకి..

హైదరాబాద్, వెలుగుపంచాయతీ కార్యదర్శుల విషయంలో రాష్ట్ర సర్కారు దారుణంగా వ్యవహరిస్తోంది. రోజుకు 12 నుంచి 14 గంటలపాటు చాకిరీ చేయించుకుంటూ.. చిన్నచిన్న కారణాలకే పెద్ద పనిష్మెంట్లు ఇస్తోంది.​ డ్యూటీకి ఒక్క రోజు రాకున్నా.. ఈజీఎస్ పనులకు కూలీలు రాకున్నా ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగిస్తోంది. పల్లె ప్రగతి కార్యక్రమం మొదలయ్యాక రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు పదుల సంఖ్యలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసిన ప్రభుత్వం.. ఈ నెల 17న ఒక్క రోజు డ్యూటీ రానందుకే మహబూబాబాద్ జిల్లాలో ఒకేసారి తొమ్మిది మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను డిస్మిస్ చేసింది.

కరోనా సోకినా మినహాయింపు ఇస్తలే

గ్రామాల్లో గతంలో పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, హరితహారం, ఇంటి పన్నుల వసూలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామసభల ఏర్పాటు పంచాయతీ కార్యదర్శుల డ్యూటీగా ఉండేది. గత ఏడాది నుంచి వారిపై క్రమక్రమంగా పని ఒత్తిడి పెరిగింది. హరితహారం మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం వారికే అప్పగించింది. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి ఉపాధి హామీ పనుల నిర్వహణను కూడా కట్టబెట్టింది. ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికలు, వైకుంఠధామాలు, కల్లాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పనులను గడవులోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టింది. ఈ పనులన్నీ చేపడుతుండగానే.. అక్టోబర్​లో ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదును ప్రారంభించింది. రోజుకు 70 ఆస్తులను నమోదు చేయాలని టార్గెట్ పెట్టింది. తెల్లవారుజామున ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గ్రామాల్లోనే ఉండాలని ఆర్డర్లు జారీ చేసింది. ఆరోగ్యం బాగోలేకున్నా, కుటుంబ సభ్యులు చనిపోయినా, చివరికి కరోనా సోకినా మినహాయింపు ఇవ్వలేదు. ఒక జాబ్ చార్ట్ అనేది లేకుండా ఇష్టారాజ్యంగా పని చేయించుకుంటూ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది. ఎవరైనా రోడ్డెక్కితే జాబ్ తీసేస్తామంటూ ఉద్యోగంలో చేరినప్పుడు రాయించుకున్న అగ్రిమెంట్ కాపీని చూపిస్తూ అధికారులు బెదిరిస్తున్నారని, ఎలాంటి మెమో ఇవ్వకుండానే డిస్మిస్ ఆర్డర్స్ జారీ చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజుకో జిల్లాలో రోడ్డెక్కుతున్నరు

పని భారం తగ్గించాలని రోజుకో జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కుతున్నారు. గత నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలకు దిగారు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలో డ్యూటీ చేస్తున్న కల్పనాదేవి ఈ నెల 16న అనారోగ్యంతో చనిపోయారు. మరుసటి రోజు 17న జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులంతా రూరల్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. సెలవులు కూడా ఇవ్వకుండా పని చేయించడం వల్లే కల్పన అనారోగ్యానికి గురయ్యారని వారు ఆరోపించారు.

పని ఒత్తిడి తగ్గించమంటే.. జాబ్​ తీసేస్తారా?

‘‘తీవ్ర పని ఒత్తిడితో మేము ఇబ్బంది పడుతుంటే.. భారం తగ్గించాల్సిందిపోయి ఉద్యోగాల్లోంచి పీకేస్తరా?’ అంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఫైర్ అయ్యారు. విధుల్లోంచి తొలగించిన 9 మంది కార్యదర్శులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. పెద్దసంఖ్యలో తరలివచ్చి నినాదాలతో హోరెత్తించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వి. శ్రీనివాస్ తదితరులు కలెక్టర్ గౌతమ్​కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ క్రమంలో ఓ పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టుండి కలెక్టర్ కాళ్లు పట్టుకోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ‘ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?’ అంటూనే అదుపులోకి తీసుకోవాలని అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు సుమారు 30 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను అరెస్ట్​ చేసి మహబూబాబాద్ అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత కలెక్టర్ ఫోన్ చేసి.. వారిని విడుదల చేయాలని ఆదేశించారు. మంగళవారం తొలగించిన 9 మంది సెక్రటరీలను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

నల్గొండలో కలెక్టరేట్ ముట్టడి

నల్గొండ జిల్లా కేంద్రంలో పంచాయతీ సెక్రెటరీలు కలెక్టరేట్​ను ముట్టడించారు. స్థానిక నాగార్జున డిగ్రీ కాలేజీ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి బైఠాయించారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుకు ఆన్​లైన్​ రిపోర్టులను కొలమానంగా తీసుకోవడం కరెక్ట్​ కాదని టీఎస్​పీఏ నల్గొండ జిల్లా అధ్యక్షుడు గణపురం నిరంజన్ అన్నారు. గ్రామాల్లోఅన్ని రకాల పనులతో పాటు 42 రకాల రికార్డులను నిర్వహించడం తలకు మించిన భారమవుతోందన్నారు.

పంచాయతీ కార్యదర్శులను వేధించొద్దు: టీఎన్జీవో విజ్ఞప్తి

పంచాయతీ కార్యదర్శులను అధికారులు వేధింపులకు, పని ఒత్తిడికి గురి చేయొద్దని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ కోరారు. ఆన్ లైన్ యాప్​లు  వాడుతూ డ్యూటీ చేయాలని ఆదేశాలిచ్చే ఆఫీసర్లు.. అందుకు అవసరమైన కంప్యూటర్, ట్యాబ్, ఇంటర్నెట్, ఫోన్ వంటివి అందజేయాల్సిన విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారని ప్రశ్నించారు. బుధవారం నాంపల్లి టీఎన్జీవో భవన్ లో రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు పర్వతాలు ఆధ్వర్యంలో కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ మధ్య పెరుగుతున్న ఒత్తిడిపై అన్ని జిల్లాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు సస్పెండ్ చేసిన పంచాయతీ కార్యదర్శులను వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది నుంచి పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన ఒత్తిడి పెంచేలా అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు తర్వాత వారి బాధ్యతలను కూడా తమకే అప్పగించారని చెప్పారు. ఉపాధి స్కీమ్ అమలుకు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సెంట్రల్ ఫోరం నేతలకు రాజేందర్, ప్రతాప్ హామీ ఇచ్చారు