పంచాయతీ కార్యదర్శులకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలి

పంచాయతీ కార్యదర్శులకు ప్రతి నెల జీతాలు ఇవ్వాలి

గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించి, ప్రతి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంగళ‌వారం సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ పంపించారు. ఎక్కువ‌ పనులు అప్పచెప్పడంతో పనిభారం ఎక్కువై కార్య‌ద‌ర్శులు మానసిక వ్యధకు గురవుతున్నారన్నారు. ప్రగతి, అభివృద్ధి జరిగితే అది సర్పంచ్ ఖాతాలోకి వెళ్తోందన్నారు. తప్పులు జరిగితే పంచాయతీ కార్యదర్శులను బాధ్యులు చేస్తున్నారని..కొన్ని చోట్ల గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

ఈ మధ్య జనగామ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి మానసిక వ్యధకు గురైనాడని, కామారెడ్డిలో ఒక కార్యదర్శి  ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. ఉన్నత విద్య , ఉద్యోగాలలో ఉన్న యువకులు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పంచాయతీ కార్యదర్శులుగా చేరారని తెలిపారు. రెండు, మూడు నెలలకొకసారి జీతాలు రావడం బాధాకరమ‌ని.. జిల్లా కలెక్టర్లు పంచాయతీ కార్యదర్శులను బాధ్యలు చేయడం సరైంది కాదన్నారు చాడ వెంక‌ట్ రెడ్డి.