గ్రామకంఠం భూముల లెక్కలపై పంచాయతీరాజ్ ఫోకస్

గ్రామకంఠం భూముల లెక్కలపై పంచాయతీరాజ్ ఫోకస్
  •    డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు
  •     గ్రామకంఠం భూములపై కమిటీ వేస్తామని ఇటీవల సీఎం ప్రకటన 
  •     17న డీపీవోలతో సెక్రటరీ మీటింగ్  
  •     ఊర్లలో ఇండ్లు కట్టేందుకు ఇబ్బందులు పడ్తున్న జనం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లోని గ్రామకంఠం భూముల వివరాలను 2 రోజుల్లో పంపాలని డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్​లను పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. అయితే, వరుసగా మూడు రోజులు సెలవులు రావటం, జెండా ర్యాలీలు, 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండటంతో వివరాలు పం పడం ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామకంఠం భూముల్లో ఇండ్ల నిర్మాణానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున.. సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేస్తామని ఇటీవల కేబినెట్ మీటింగ్​లో కేసీఆర్ ప్రకటించారు. దీంతో గ్రామకంఠం భూముల లెక్కలు రెడీ చేయడంపై పంచాయతీరాజ్ శాఖ ఫోకస్ పెట్టింది.  

ప్రత్యేక ఫార్మాట్​లో వివరాలు

గ్రామ కంఠం వివరాలు పంపటానికి అధికారు లు ప్రత్యేక ఫార్మాట్​ను రూపొందించారు. జి ల్లా, మండలం, జీపీ పేరు, పంచాయతీలో ఉన్న  ఇండ్లు, ఆవాసాలు, రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం జీపీ విస్తీర్ణం (ఇండ్లు, ఆవాసాలు, భూము లు), గ్రామ కంఠం భూమిలో ఉన్న ఇండ్లు, పట్టా లేకుండా పబ్లిక్ ఆధీనంలో ఉన్న భూముల వివ రాలు, పంచాయతీ అవసరాలు ఉదాహరణకు రోడ్లు, వాటర్ ట్యాంక్ లకు ఉపయోగించిన విస్తీర్ణం, స్కూళ్లు, , పల్లె ప్రకృతి వనాలకు ఉపయో గించగా ఖాళీగా ఉన్న ల్యాండ్ వంటి సమగ్ర వివరాలను పంపాలని ఫార్మాట్ లో పేర్కొన్నారు.  

ఈ నెల 17న మీటింగ్  

గ్రామ కంఠం భూములపై ఈ నెల 17న అన్ని జిల్లాల డీపీవోలతో పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు ఇతర అధికారులు సమావేశం కానున్నారు.  అప్పటికల్లా సాధ్యమైనంత వరకు వివరాలు అందచేయాలని అధికారులను ఆదేశించారు. మీటింగ్ లో డీపీవోల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. డీపీవోలు పంపిన నివేదికలను సీఎస్, సీఎంకు అందచేయనున్నట్లు తెలిసింది. 

ధరణి వచ్చినా పరిష్కారమైతలే 

నాలా అనుమతులు పొందకుండా గతంలో వ్యవసాయ భూమిలో ఇండ్లు కట్టుకున్న వారికి ప్రస్తుతం భూ యాజమాన్య హక్కులు పొందడం కష్టంగా మారింది. ఆ భూమి ఆబాది లేదా గ్రామ కంఠంలో లేకపోవడంతో లోకల్ బాడీల ఫైళ్లలో నమోదు కాలేదు. ఇండ్లు ఉండటం వల్ల అటు సాగు భూమి జాబితాలోనూ లేకుండా పోయింది. సర్వే నంబరు, ఖాతా రెండూ ఆన్‌‌లైన్‌‌లో లేకపోవడంతో ఆ విస్తీర్ణం మొత్తం ఫైళ్లలో చేరలేదు. ఇలాంటి భూముల్లో ఇండ్ల నిర్మాణానికి స్థానిక సంస్థలు అనుమతులు ఇవ్వడం లేదు. సాగు భూమిలో ఇల్లు నిర్మించుకున్నంత వరకు నాలాకు అనుమతి ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ధరణిలో ఆప్షన్లు  కూడా ఇచ్చింది. అయితే సరైన గైడ్ లైన్స్ లేకపోవడంతో పరిష్కారం కావడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రికార్డుల్లో లేక జనం అవస్థలు  

రాష్ట్రంలోని వేల గ్రామాల్లో భూ సంబంధిత సమస్యతో ఇండ్లకు అనుమతులు లేక, ఇంటి నంబర్లు రాక ఓనర్లు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 31,093 సర్వే నంబర్లలో గ్రామకంఠం, ఆబాదీ భూములు ఉన్నట్లు అంచనా. గ్రామాల నిర్మాణాలకు కేటాయించిన స్థలాలను ఈ పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. కొన్నిచోట్ల వాటికి ఆనుకుని ఉండే ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవన్నీ పంచాయతీ, మున్సిపాలిటీల ఫైళ్లలో నమోదై ఉన్నాయి. కాలక్రమంలో గ్రామాలు విస్తరించే కొద్దీ ఈ భూములకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో ఇండ్లు వెలిశాయి. అవీ చేతులు మారుతూ వస్తున్నాయి. అలాంటి భూముల ఓనర్ షిప్ విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. గతంలో తాము నివసిస్తున్న భూమికి, ఇండ్లకు రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్నవారికి కొంత స్పష్టత ఉండగా, ఇంటికి మాత్రమే నంబరు తీసుకుని, పంచాయతీలో నమోదు చేసుకున్న వారు ఇప్పుడు అవస్థ పడుతున్నారు.

నిపుణుల పరిష్కారాలు ఇవే.. 

ప్రభుత్వం ఆస్తుల నమోదు సర్వేలో భూ సమస్యలను గుర్తించి అవి ఏ రకానికి చెందినవో నమోదు చేయాలని, దేవాదాయ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న చోట్ల ప్రత్యేక అధ్యయనం చేసి పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు. యాజమాన్య హక్కులు, వారసత్వ బదిలీ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయినచోట తగిన చర్యలు చేపట్టాలని చెబుతున్నారు.