నాలుగు నెలలుగా పంచాయతీలకు పైసా రాలె

నాలుగు నెలలుగా పంచాయతీలకు పైసా రాలె

ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, వర్కర్లు

ఆసిఫాబాద్,వెలుగు: పొద్దుపొడవక ముందే తట్టా, చీపురు, పంజాలతో ఊరును క్లీన్ చేస్తున్న పంచాయతీ కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. నాలుగు నెలలుగా వేతనం రాక... బయట అప్పుపుట్టక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. పంచాయతీలకు మూడు నెలలుగా ప్రభుత్వం తరఫున పైసా రాలేదు. దీంతో చాలా గ్రామాల్లో పారిశుధ్య పనులు, వీధి దీపాల కొనుగోలు, చెత్త తొలగించేందుకు ట్రాక్టర్, ట్రాలీ వినియోగించడంలేదు. నిధుల సమస్య కారణంగా సర్పంచులు, కార్యదర్శులు పంచాయతీ ఆఫీస్ లకు వెళ్లడంలేదు.

తనిఖీలు తగ్గించారు..ఆఫీస్ వర్క్ పెంచారు...

గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం లోకల్ బాడీస్ కోసం అడిషనల్ కలెక్టర్ ను నియమించింది. మూడు నెలలుగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీపీవో గ్రామాలను సందర్శించడం చాలావరకు తగ్గించారు. డ్రైడే, సెగ్రికేషన్ షెడ్ ల నిర్వహణ పట్టించుకోవడంలేదు. పంచాయతీరాజ్​ దినోత్సవం సందర్భంగా ఏటా ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి నగదు అవార్డు అందజేస్తోంది. దీని కోసం గతంలో జిల్లా వారీగా కలెక్టర్లు మెరుగుగా ఉన్న పంచాయతీలను సెలెక్ట్​ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేవారు. నిధుల లేమి కారణంగా క్షేత్రస్థాయిలోని సమస్యలు బయటకు రాకుండా ఉండేలా అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వెబ్​సైట్​లో పొందుపర్చాలని జిల్లా అధికారులు ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు నెలరోజులుగా వివరాల నమోదు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏమీ చేయనప్పుడు అవార్డు కోసం అప్లై చేసుకొని ఏంలాభమని మండల స్థాయి ఆఫీసర్లు పెదవి విరుస్తున్నారు. 

మస్తు తిప్పలైతుంది...

నాలుగు నెలల సంది జీతం రాకపోవడంతో మస్తు తిప్పలైతుంది. కిరాణ షాపులోళ్లు ఉద్దెర ఇస్తలేరు. ఇప్పటికే బాకీ ఉన్న డబ్బులు ఎప్పుడు కడుతారని అడుగుతున్నారు. ఏదైనా పనికి పోయిన బాగుండు. ప్రతీ నెల జీతం వచ్చేలా ఆఫీసర్లు చూడాలె.

- ఆత్రం శంకర్, 
మల్టీపర్పస్​వర్కర్,​ ఖైరిగూడ 

మూడు నెలల నుంచి ఫండ్స్​లేవు..

మూడు నెలలుగా పంచాయతీలకు ఫండ్స్​రాలేదు. పారిశుధ్య కార్మికులకు జీతాలు, కరెంట్ బిల్లు, ట్రాక్టర్ డీజిల్, ఇతర అత్యవసర ఖర్చులకు నెలకు దాదాపు రూ. 1.50 లక్షలు అవుతుంది. ఇంటి టాక్స్​వసూలు చేసి జనరల్ ఫండ్స్ నుంచి ఖర్చు చేస్తున్నాం.

-ప్రణీత్ బాబు, 
పంచాయతీ సెక్రటరీ, దహెగాం

ఫండ్స్​ రిలీజ్ ​కాగానే జమ చేస్తాం..

జిల్లాలో 1100 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఇందులో కొన్ని పంచాయతీలకు నిధులు వచ్చాయి. ఫండ్స్ రాని గ్రామ పంచాయితీలకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఖాతాల్లో జమచేస్తాం. ఇబ్బందులు పడాల్సి అవసరం లేదు.

- రమేశ్, డీపీవో, ఆసిఫాబాద్