ప్రణీత్‌‌ రావు కదలికలపై నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం

ప్రణీత్‌‌ రావు కదలికలపై నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం
  •     ఎస్‌‌ఐబీలో రికార్డ్స్‌‌ ధ్వంసం చేసిన నాటి నుంచే అతనిపై ఫోకస్​
  •     రెండు టీమ్స్‌‌తో అతనిపై సర్వైలెన్స్
  •     అరెస్టు చేసేందుకు చర్యలు

హైదరాబాద్‌‌, వెలుగు :  ఫోన్‌‌ ట్యాంపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ప్రణీత్​రావు ఉంటున్న రాజన్న సిరిసిల్ల పోలీస్‌‌ హెడ్‌‌క్వార్టర్స్‌‌లో సోమవారం సోదాలు జరిపారు. రెండు టీమ్​లతో ప్రణీత్ ఉంటున్న క్వార్టర్​పై నిఘా పెట్టినట్టు తెలుస్తున్నది. అతని కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం. ఎస్‌‌ఐబీ ఆఫీస్‌‌లో రికార్డులను విధ్వంసం చేసిన తర్వాత నుంచి అతనిపై ఇంటెలిజెన్స్​అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తున్నది. ఇంటెలిజెన్స్‌‌కు చెందిన అత్యంత కీలక సమాచారాన్ని అతను ధ్వంసం చేసినట్లు ఆదివారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌లో అతనిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

డిసెంబర్‌‌‌‌ నుంచే..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు కావడంతో పోలీసులు అత్యంత రహస్యంగా ఎంక్వైరీ చేస్తున్నారు. డీజీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నది. డిసెంబర్‌‌ 6వ తేదీ నుంచే‌‌ ప్రణీత్‌‌రావు కదలికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎస్‌‌ఐబీ ఆఫీస్‌‌లో హార్డ్‌‌డిస్క్‌‌ల మార్పిడి, ఇంటెలిజెన్స్‌‌ డేటా ధ్వంసం గుర్తించిన వెంటనే ఇంటెలిజెన్స్‌‌ ఉన్నతాధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అంతర్గత విచారణ జరిపి అతన్ని సస్పెండ్‌‌ చేశారు. ప్రణీత్‌‌రావు సస్పెన్షన్ ఆర్డర్‌‌‌‌లో కూడా రాజన్నసిరిసిల్ల హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను విడిచి వెళ్లవద్దని పేర్కొన్నారు.

అరెస్టుకు రంగం సిద్ధం

ఎస్‌‌ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రణీత్​రావుపై ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేశారు. ప్రస్తుతం అతను రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీఆర్‌‌‌‌బీ హెడ్‌‌క్వార్టర్స్‌‌లో ఉంటున్నాడు. అక్కడ అతని క్వార్టర్స్​లో పోలీసులు సోదాలు నిర్వహించారని తెలుస్తున్నది. అలాగే అక్కడి సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. త్వరలలో ప్రణీత్​రావును అరెస్టు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వర్గాలు చెప్తున్నాయి.