- అనుమానం వ్యక్తంచేసిన వీసీ అల్దాస్ జానయ్య
- పరీక్షల విధానంలో సమూల మార్పులు
- ఇందుకోసం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో కమిటీ
- ఇప్పటికే కేసును విచారిస్తున్న సీఐడీ
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య బుధవారం మరో బాంబు పేల్చారు. గడిచిన ఏడేళ్లుగా, ఆన్లైన్ పరీక్షల వ్యవస్థ పెట్టినప్పటి నుంచి పేపర్ లీకేజీ జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గత డిసెంబర్ 24న వీసీ అల్దాస్ జానయ్య, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ కె. ఝాన్సీ రాణి జగిత్యాల వ్యవసాయ కళాశాలను సందర్శించారు.
పరీక్షా హాల్ సీసీ ఫుటేజీని యాదృచ్ఛికంగా పరిశీలించగా, విద్యార్థి ఎమ్. రమేశ్ (ఐడీ నెం. సీఏజేఏ-2023-036) నవంబర్ 17న జరిగిన పాత్ 371 సబ్జెక్టు పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. వరంగల్ అగ్రికల్చర్కాలేజీ లో పేపర్ లీక్చేసి, వివిధ కాలేజీల్లో చదువుతున్న 30 మంది ఇన్-సర్వీస్ విద్యార్థుల(వ్యవసాయ శాఖ ఏఈఓలు)కు వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు తేల్చారు. ఐదు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు లీక్ చేసిన సిబ్బందికి పెద్దమొత్తంలో లంచం ఇచ్చినట్లు బయటపడింది.
కాగా, ఈ ఘటనపై విచారణకు విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సి. నరేందర్ రెడ్డి చైర్మన్ గా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తేల్చింది. దీంతో జనవరి 9న యూనివర్సిటీ 30 మంది విద్యార్థులను కాలేజీలు, హాస్టళ్ల నుంచి బహిష్కరించి, పేరెంట్ డిపార్ట్‌మెంట్‌కు తిరిగి పంపించింది. అలాగే, ముగ్గురు టీచింగ్ సిబ్బంది, ఒక నాన్-టీచింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, అగ్రికల్చర్ సెక్రటరీ కి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో జనవరి 12న హైదరాబాద్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీఐడీ ఈ కేసును విచారిస్తోంది. ఇదిలా ఉండగా, పరీక్షల విధానాన్ని సమూలంగా సంస్కరించేందుకు యూనివర్సిటీ.. రిటైర్డ్ సీనియర్ ప్రొఫెసర్ బి. గోపాల్ సింగ్ చైర్మన్‌గా సీనియర్ నిపుణుల కమిటీని నియమించింది.
