
తమిళ నటుడే అయినా పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్. రీసెంట్‌గా ‘మదరాసి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తను ప్రస్తుతం ‘పరాశక్తి’ సినిమాలో నటిస్తున్నాడు. ‘ఆకాశమే నీ హద్దురా’ ఫేమ్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శుక్రవారం సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. పొంగల్ కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శివ కార్తికేయన్ పవర్‌ఫుల్ లుక్‌లో ఇంటెన్స్‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు.
చేతిలో గోలీ సోడా పట్టుకుని ఉండగా, దానికి నిప్పు వెలిగించి ఉండటం, వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఏవో అల్లర్లు జరుగుతున్నట్టు కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి, అథర్వ, రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంతోపాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి.