కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు సహకరించండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పరశురామ్ వినతి

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు సహకరించండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పరశురామ్ వినతి

న్యూఢిల్లీ, వెలుగు: కరెన్సీ నోట్లపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫోటో ముద్రణకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డా. జేరిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. 

శనివారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ శబరి బ్లాక్ లో డిప్యూటీని సీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పరశురామ్ మాట్లాడతూ..1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలిన టైంలో  అంబేద్కర్ "రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం" పేరుతో పుస్తకం రాశారని గుర్తుచేశారు. 

దాన్ని హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్‌‌లకు అందజేశారని, దీని ఆధారంగానే 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బీఐ) ఏర్పడిందని వెల్లడించారు. ఆర్‌‌బీఐ ఏర్పడి 90 ఏండ్లు గడుస్తున్నా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించకపోవడం చరిత్రను వక్రీకరించడమేనని పరశురామ్ విమర్శించారు.