త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా పార్సిల్ రవాణా సేవలు

త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా పార్సిల్ రవాణా సేవలు

హైదరాబాద్, వెలుగుఆర్టీసీకి ఇన్ కమ్ తగ్గిపోవడంతో కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే కార్గో సర్వీసులు ప్రారంభించి నడుపుతుండగా, తాజాగా పార్సిల్ సర్వీసులు కూడా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తు స్టార్ట్ చేసింది. త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా పార్సిల్ రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఓ ఉన్నతాధికారిని స్పెషల్ ఆఫీసర్ గా ఆర్టీసీ నియమించింది. ఇప్పటిదాకా ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టును రద్దు చేయనున్నారు. సంస్థలో అదనంగా ఉన్న స్టాఫ్ తోనే దీనిని నడిపించనున్నారు. పల్లె వెలుగు బస్సు మొదలుకొని ఏసీ బస్సుల వరకు అన్నింటినీ పార్సిల్ సర్వీసులకు వాడుకోనున్నారు. మొదటగా కలెక్షన్ పాయింట్ల వద్దకు మాత్రమే సర్వీసులు ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా హోం డెలివరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీలో కొనసాగిస్తున్న పార్సిల్ విధానంపైనా అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ఇన్ కమ్ పెంచుకోవడమే టార్గెట్..

కరోనాతో అన్ని రంగాలు సంక్షోభంలో పడ్డాయి. 58 రోజులు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్నా ప్రయాణికులు ఎక్కువగా ఉండటం లేదు. 35 శాతం ఓఆర్ కూడా రావడంలేదు. అంతకుముందు రెండు నెలల సమ్మెతో తీవ్ర నష్టం వచ్చింది. దీంతో టికెట్ యేతర ఆదాయంపై ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పార్సిల్ సర్వీసులను సొంతంగా నడపాలని నిర్ణయించింది. ఆర్టీసీలో ఇప్పటిదాకా ప్రైవేట్ కొరియర్స్ పార్సిల్ సర్వీసులు నడుపుతున్నాయి. వీటిని రద్దు చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ పార్సిల్ సర్వీసుల ద్వారా ఆర్టీసీకి నెలకు రూ. 70 లక్షల ఆదాయం వస్తోంది. ఇందుకోసం ఏసీ బస్సులు మినహా అన్నింటినీ వాడుకునేవారు. బస్ పాస్ కౌంటర్ల నిర్వహణ ఆర్టీసీనే చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చి నడిపిస్తున్నారు.

కలెక్షన్ పాయింట్ల వరకే సర్వీసులు..

ఏపీలో ఇప్పటికే పార్సిల్ సర్వీసులు ఆర్టీసీనే నడిపిస్తూ, మంచి ఆదాయం పొందుతోంది. ఖర్చులన్నీ పోగా ఏడాదికి రూ. 70 కోట్లకు పైగా లాభం వస్తోంది. ప్రతి రీజియన్, డిపో స్థాయిలో అధికారులను సంస్థ నియమించింది. మేజర్ బస్టాండ్లలో కలెక్షన్ పాయింట్లను పెట్టింది. పార్సిల్ ను కలెక్షన్ పాయింట్ వద్దకు వెళ్లి తెచ్చుకోవాలి. ఇటీవల కొన్ని జిల్లాల్లో డోర్ డెలీవరీ కూడా స్టార్ట్ చేశారు. దీనికీ మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు అంటున్నారు. అయితే ఏపీలో పై స్థాయి మినహా, మిగతా వారంతా ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. హోం డెలివరీ కోసం బస్టాండ్ల నుంచి ఇంటికి తరలించడానికి ఏజెన్సీలను పెట్టుకున్నారు. అయితే ఏపీ సిస్టమ్ ను అడాప్ట్ చేసుకోవాలా.. లేక కొత్తగా ఏదైనా చేయాలా అని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటగా కలెక్షన్ పాయింట్ల వరకే సర్వీసులను ప్రారంభించి, తర్వాత హోం డెలివరీపై ఫోకస్ పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పార్సిల్కు అడిషనల్ స్టాఫ్..

ఆర్టీసీ సమ్మె తర్వాత ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వెయ్యి బస్సులకు పైగా రద్దు చేశారు. డ్యూటీ గంటలు పెంచారు. దీంతో మూడు నుంచి నాలుగు వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు ఖాళీగా ఉన్నారు. వీరిలో కొందరిని కార్గో సర్వీసులకు ఉపయోగించుకుంటున్నారు. మిగతావారంతా ఖాళీగా ఉన్నారు. అందుకే వీరిలో ఆసక్తి ఉన్న వెయ్యి మంది స్టాఫ్ ను పార్సిల్ సర్వీసులకు వాడుకోనున్నారు. పార్సిల్ సర్వీసు కోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ ఆఫీసర్ ను కూడా ఆర్టీసీ నియమించింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓఎస్డీగా కృష్ణకాంత్ ను శుక్రవారం నియమించారు. దీని పర్యవేక్షణ, విధివిధానాలు, అమలు తీరు మొత్తం ఈయనే చూడనున్నారు.

100 ఏళ్ల క్రికెటర్ కన్నుమూత