ప్రైవేట్ ఫీజులతో పేరెంట్స్ పరేషాన్

ప్రైవేట్ ఫీజులతో పేరెంట్స్ పరేషాన్

ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతూ ప్రైవేట్‍ స్కూల్స్ మేనేజ్‍మెంట్లు పేరెంట్స్ ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా వాటిని పాటించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఆలంబనగా చేసుకొని ప్రైవేట్‍ విద్యాసంస్థలు రెచ్చిపోతున్నాయి. టీచర్లకు వేతనాలు, మౌలిక వసతుల కల్పన తదితర పేర్లతో విచ్చలవిడిగా ఫీజులను పెంచుతున్న ప్రైవేట్‍ స్కూల్స్ మేనేజ్‍మెంట్లు పేదలు, మిడిల్‍ క్లాస్‍ కుటుంబాల్లోని పిల్లలకు ప్రైవేట్‍ విద్య ఖరీదైన వ్యవహారంగా మార్చేశారు.  ప్రైవేట్‍ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలు రూపొందించినప్పటికీ వాటి అమలును మాత్రం గాలికొదిలేసింది. ఏటా సెప్టెంబరు మాసం చివరికల్లా ప్రతి ప్రైవేట్‍ స్కూల్ విధిగా తమ జమా ఖర్చులను తెలిపే డాంక్యూమెంట్స్ ఆడిట్‍కు సమర్పించాల్సి ఉంటుంది. మరో 20 రోజుల్లో  2019–20 అకడమిక్‍ ఇయర్‍ పున:ప్రారంభమవుతుంది. ఈ దశలో కూడా పలు ప్రైవేట్‍ పాఠశాలలు ఇప్పటికీ తమ జమా ఖర్చు లెక్కలను ఆడిట్ చేయించడం లేదు. ఎఫ్‍ఏసీ ఎన్‍జీఓ ఫిబ్రవరిలో అధిక ఫీజులను వసూలు చేస్తున్న నగరంలోని 12 ప్రైవేట్‍ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్‍ ఆఫ్‍ చైల్డ్ రైట్స్(ఎన్‍సీపీసీఆర్‍) కు ఫిర్యాదు చేసింది. దానిపై స్పందించిన ఎన్‍సీపీసీఆర్‍  తెలంగాణ స్కూల్‍ ఎడ్యుకేషన్‍కు మే 7న లేఖ రాసింది. 20 రోజుల్లో ఆయా పాఠశాలపై తీసుకున్న చర్యలను తెలపాలని అందులో కోరింది.

20–30 శాతం పెరుగుదల
ఇటీవల కొన్ని ప్రైవేట్‍ పాఠశాలల్లో భారీగా పెంచిన ఫీజుల భారాన్ని తట్లుకోలేక కడుపు మండిన పేరెంట్స్ ఆందోళన చేస్తున్నారు.  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులను వసూలు చేస్తున్న పలు స్కూల్స్ పై చీటింగ్‍ కేసులు కూడా నమోదు చేయడం పరిస్థితి తీవ్రత తెలుపుతుంది. గ్రేటర్‌‌లో సుమారు 6వేలకు పైగా  ప్రైవేట్‌‌ స్కూల్స్ ఉంటాయి. ఇందులో 1000కుపైగా ఐసీఎస్‌‌ఈ, సీబీఎస్‌‌ఈ సిలబస్‌‌ బోధించే స్కూల్స్ ఉంటాయి.  అప్పర్ మిడిల్‍ క్లాస్, ఉన్న వర్గాలు తమ  పిల్లలను ఎక్కువగా వీటిల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఆయా స్కూల్స్ లలో కూడా ఇటీవల 20–30 శాతం పెంచిన ఫీజుల పట్ల పేరెంట్స్ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు.  ఒక్కోస్కూల్‍ ఒక్కో రకం ఫీజులను వసూలు చేస్తున్నాయి.  రూ.40 వేల నుంచి ప్రారంభమై రూ.70 వేలకు పైగా ఫీజులు ఉంటాయంటే నమ్మశక్యం కాదు. ట్రాన్స్ పోర్ట్, డ్రెస్సులు, పుస్తకాలు, టై, బెల్ట్, టెర్మ్, వెకేషన్‍, స్టడీ టూర్లు తదితర ఖర్చులు అదనం.  ఇటీవల స్కూల్స్ మెయింటనెన్స్ ఖర్చులు, టీచర్ల జీతాలు, స్టూడెంట్స్ కు మెరుగైన సదుపాయాలు  తదితర కారణాలతో ఫీజులు పెంచాల్సి వస్తోందంటూ ప్రైవేట్‍ మేనేజ్‍మెంట్లు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి తమ పని గుట్టుగా కానిచ్చేస్తున్నాయి.  ప్రైవేట్‍ పాఠశాలలు ఫీజులను ఇష్టానుసారంగా పెంచితే చర్యలు తీసుకుంటామని, పూర్తి ఆధారాలతో పేరెంట్స్  విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. గత అకడమిక్‍ ఇయర్‍లో అధిక ఫీజులను వసూలు చేసిన  రెండు స్కూల్స్ పై  చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

డీపీఎస్‍పై ఫిర్యాదు చేసిన పేరెంట్స్
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక క్యాపిటేషన్‍ ఫీజులను వసూలు చేస్తూ సెక్షన్‍ 13 ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఢిల్లీ పబ్లిక్‍ స్కూల్‍(డీపీఎస్‍) మియాపూర్‍ బ్రాంచీ స్కూల్‍పై పేరెంట్స్ దుండిగల్‍ పీఎస్‍లో చీటింగ్‍ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. శనివారం సుమారు 50 పేరెంట్స్  ఫోరం కరెప్షన్‍ ఎగైనస్ట్ ఎన్‍జీఓ సాయంతో పీఎస్‍లో కేసు నమోదు చేసేందుకు వెళ్లగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు మొదట్లో నిరాకరించారు. ఒక స్కూల్‍పై ఎన్‍జీఓ తరపున చీటింగ్ కేసు నమోదు చేసేందుకు నిబంధనలు ఒప్పుకోవాలని పోలీసులు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తీసుకుంటామని చెప్పారు. అక్కడే ఉన్నా పేరెంట్స్ లో దాదాపు 38 మంది డీపీఎస్‍ స్కూల్‍లో అధికంగా ఫీజులు తీసుకుంటున్నట్లు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఫోరం ప్రెసిడెంట్‍ విజయ్‍ గోపాల్ తెలిపారు ఎఫ్‍ఐఆర్‍ నమోదు చేస్తామని పోలీసులు పేర్కొనట్లు ఆయన  వివరించారు.