భారమైన హృదయంతో.. కొడుకు చివరి కోరిక తీర్చిన పేరెంట్స్

భారమైన హృదయంతో.. కొడుకు చివరి కోరిక తీర్చిన పేరెంట్స్

పిల్లలు పుడితే తల్లిదండ్రులు దేశాన్నే జయించినట్లు హ్యాపీగా ఫీలవుతుంటారు. అలాంటిది తల్లిదండ్రుల కళ్లముందే తన బిడ్డ చనిపోతాడనే వార్త వినిపిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం.. వాళ్ల బాధను ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేరు.. అలా అని వారి మరణాన్ని ఆపలేరు.. కనీసం వారు చనిపోయే ముందు వారి కోరికను అయినా తీర్చుదామని చూస్తారు.. 

తాజాగా గుంటూరుకు చెందిన తల్లిదండ్రులకు ఇదే పరిస్థితి ఎదురైంది. తన చిన్నారికి క్యాన్యర్ గా వైద్యులు నిర్థారించారు.. బాబును కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. చివరికి చేసేదేమిలేక భారమైన హృదయాలతో తన చిన్నారి చివరి కోరికను తీర్చారు. వివరాల్లోకి వెళితే..
   
గుంటూరుకు చెందిన అనుపోజు బ్రహ్మం , తల్లీ లక్ష్మి దంపతులకి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి (7) 4 వ తరగతి పూర్తి చేశాడు. గత సంవత్సరం పాఠశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలవ్వడంతో.. వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో సంవత్సర కాలంగా మోహన్ సాయి బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాంత వ్యాధి రోజులు గడుస్తున్నా కొద్ది చిన్నారిని చిధిమేస్తోంది. దీంతో చిన్నారిని బ్రతకడం కష్టతరమవుతోందని.. తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయని.. చిన్నారి చివరి కోరిక తీర్చాలని సూచించారు. 

దీంతో చిన్నారికి పోలీసు అధికారి కావాలన్న కోరికను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది.. మేక్ ఏ ఫౌండేషన్ సభ్యులతో చిన్నారిని బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అతని కోరికను గురించి చెప్పారు. దీంతో అక్కడి సిబ్బంది చిన్నారికి పోలీస్ గెటప్ వేయించి.. స్టేషన్ కు సాదరంగా ఆహ్వానించి.. పోలీస్ అధికారిగా సిట్ లో కూర్చోబెట్టి అతని కోర్కెను తీర్చారు.

బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేసి.. చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్ లో జరిగే పని విధానం గురించి వివరించారు. ఆ తర్వాత చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు.