
- ఎంఈవో ఆఫీస్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళన
బచ్చన్నపేట,వెలుగు : స్కూల్ టీచర్‌ను బదిలీ చేయొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. టీచర్ పై నమ్మకంతోనే తమ పిల్లలను బడికి పంపించామని పేర్కొన్నారు. బదిలీ అయినా కానీ.. తిరిగి స్కూల్ కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల ప్రైమరీ స్కూల్లో టీచర్ శ్రీనివాస్ పని చేస్తున్నాడు. స్కూల్ప్రారంభ సమయంలో ‘బడిబాట’ భాగంగా ఇంటింటికి వెళ్లి పిల్లలను సర్కార్బడికి పంపించాలని టీచర్ కోరారు. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దే బాధ్యత తనదేనని హామీ ఇచ్చాడు. దీంతో టీచర్ పై నమ్మకంతో 30 మంది పిల్లలను తల్లిదండ్రులు సర్కార్బడికి పంపించారు.
కాగా.. టీచర్ శ్రీనివాస్ ప్రమోషన్‌పై బదిలీ అవుతున్నట్టు తెలియడంతో గురువారం ఎంఈవో ఆఫీసుకు తల్లిదండ్రులు వెళ్లారు. టీచర్ ను ఎక్కడికి బదిలీ చేసినా తిరిగి చిన్నరామచర్ల స్కూల్‌కే డిప్యూటేషన్ పై తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తమ పిల్లల భవిష్యత్ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఎంఈవో వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు.