మరో బడికి తాళం వేసిన తల్లిదండ్రులు

మరో బడికి తాళం వేసిన తల్లిదండ్రులు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక సర్కారు బళ్ళు మూత పడుతుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీన్ రివర్స్ అవుతోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తగినంత బోధనా సిబ్బంది లేక ప్రజల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేస్తున్నారు. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలోని పాఠశాలలో 140 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళం వేసిన ఘటన మరువకముందే దమ్మపేట మండలం, మల్లారంలో అదే సీన్ చోటు చేసుకుంది. ఈ పాఠశాలకు పేరెంట్స్ తాళాలు వేశారు. మల్లారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా ఒక టీచర్ ఆరు సంవత్సరాల క్రితం డిప్యుటేషన్ పై వెళ్లిపోయారు. సదరు టీచర్ హైదరాబాద్ లో ఉంటూ మల్లారం గ్రామంలోని పాఠశాలలో టీచర్ గా జీతం పొందుతుండడం గమనార్హం.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ పిల్లల భవిష్యత్తు మారుతుందని ఎంతో ఆశ పడ్డామని కానీ టీచర్ల కొరతతో అసలుకే మోసం వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు వస్తున్నా.. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు తమ సమస్యలపై వెంటనే స్పందించి టీచర్ల నియామకం చేసి విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. దమ్మపేట ఎంఈఓ మల్లారం గ్రామంలోని పాఠశాల వద్దకు వచ్చిన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.