మార్చిలో ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చ’

మార్చిలో ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చ’

పరీక్షలు రాసే 9,10, ఇంటర్ విద్యార్ధుల్లో భయాందోళనలను తొలగించేందుకు ప్రధాని మోడీ 2018 నుంచి పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా మార్చి నెలలో పరీక్షా పే చర్చ నిర్వహించనున్నారు. ప్రతీ సంవత్సరం జనవరిలో జరిగే ఈ సమావేశం కరోనాతో కొంత ఆలస్యమయ్యింది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్‌ విధానంలో విద్యార్థులతో ప్రధాని మాట్లాడతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. ఈ సమావేశం మార్చి నెలలో జరుగుతుందని… తేదీలను త్వరలో ప్రకటిస్తామని ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా అనుమతించనున్నారు.

దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇవాళ్టి(గురువారం) నుంచి ప్రారంభమవుతుందని, మార్చి 14 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌. ప్రధానితో ఇంటరాక్ట్‌ అవ్వాలనుకున్న విద్యార్థులు innovateindia.mygov.in  వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన థీమ్‌లలో 500 పదాలకు మించకుండా తమ ప్రశ్నలను పంపించాలని చెప్పారు.