జాగా కబ్జా చేసి బ్యాడ్మింటన్ కోర్టు నిర్మాణం

జాగా కబ్జా చేసి బ్యాడ్మింటన్ కోర్టు నిర్మాణం
  • ఆటగాళ్ల నుంచి డబ్బులు వసూలు
  • నిర్వహణ ఖర్చు మాత్రం బల్దియాదే..
  • అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

 

కరీంనగర్, వెలుగు: స్థానిక మున్సిపల్లో పార్కుల స్థలాలు దర్జాగా కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నగరంలో పిల్లలు ఆడుకునేందుకు పార్కు స్థలాలే దొరకడంలేదంటే.. ఉన్న కొద్దిపాటి స్థలాలను ప్రైవేటు వ్యక్తులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. కాపాడాల్సిన బల్దియా అధికారులే పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో పలువురు యథేచ్ఛగా స్థలాలు ఆక్రమించుకుని ప్రైవేటు నిర్మాణాలు చేపడుతున్నారు.

దర్జాగా బ్యాడ్మింటన్​ కోర్టు..  
నగరంలోని రాంనగర్ రోడ్ మంకమ్మతోట ప్రాంతంలోని రాజీవ్ పార్క్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతోంది. ఇక్కడున్న ఎకరం  ఏరియాలో భారీ స్థాయిలో ఇండోర్ స్టేడియం మాదిరిగా బ్యాడ్మింటన్ కోర్టును ఆ ఏరియా సభ్యులు నిర్మించారు. ఇక్కడ ఈ ఏరియా వాళ్లు రెగ్యులర్ గా ఆడుకోవడంతోపాటు ఇక్కడికి వచ్చే ఆటగాళ్ల వద్ద రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు డబ్బులు తీసుకుని ఆడిస్తున్నారు. బల్దియా పార్కులో కమర్షియల్ నిర్మాణాలు చేయడమే తప్పు. పైగా అమౌంట్ కలెక్ట చేయడం.. సుమారుగా నెలకు రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వచ్చిన మొత్తంలో బల్దియాకు రూపాయి రావడం లేదు. పైగా దీనికయ్యే మొత్తం వాటర్, కరెంట్ బిల్లు తదితర నిర్వహణ చార్జీలన్నీ మున్సిపల్ వారే భరించడం విశేషం. దీనికి సమీపంలో లైబ్రరీ నిర్మించారు. మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకే ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఆయా నిర్మాణాలపై పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రూ.70లక్షల అభివృద్ధి పనులు..
రాజీవ్ పార్కులో రూ.70లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గేట్, జిమ్ ఎక్విప్ మెంట్స్, లాన్, లైటింగ్, పెయింటింగ్, కంపౌండ్ వాల్, డ్రైనేజీ తదితర పనుల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. రోడ్డు కంటే పార్కు కిందకు ఉండటంతో వర్షం కురిసినపుడు నీరంతా పార్కులోకి చేరి జలమయమవుతోంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి పార్కుకు ముందువైపు ఉన్న గేట్ ను తొలగించి వెనకవైపు అమర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్కు నుంచి నీరు పోయేందుకు, పార్కులోని వాటర్ ఫౌంటేన్ లోని నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేకంగా డ్రైనేజీని కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పార్కులో గ్రావెల్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన తర్వాత లాన్ తదితర పనులు చేపట్టనున్నారు. సర్కారు ఓ వైపు లక్షలు ఖర్చు చేసి పార్కును అభివృద్ధి చేస్తుంటే.. మరోవైపు పార్కు స్థలాలలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టి వాడుకుంటున్నారు.  

పార్క్ స్థలం రక్షించాలి 
నగరంలో పిల్లల కోసం ఆట స్థలాలు కరువవుతున్నాయి. మంకమ్మ తోటలోని రాజీవ్ పార్క్ లో అక్రమంగా కట్టడాలు వెలుస్తున్నాయి. పార్కులో దర్జాగా షటిల్ కోర్టు కట్టారు. అందులో ఆడిన వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. దీనివల్ల బల్దియాకు ఎలాంటి ఆదాయం లేదు. అక్రమ కట్టడాలను తొలగించి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. 
- ఎండీ అమీర్, సామాజిక కార్యకర్త

కబ్జాకు అవకాశం లేదు
రాజీవ్ పార్కులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పార్కులో ఒక వైపు ఎన్నో ఏళ్ల కింద నిర్మించుకున్న కోర్టులో షటిల్ ఆడుతున్నారు. పార్కు స్థలాలు కబ్జాకు గురయ్యే అవకాశం లేదు. ఇక్కడ నిర్మించిన లైబ్రరీ స్థలాన్ని కబ్జా కానివ్వం. పార్కు అభివృద్ధి పనులు వేగంగా చేపట్టి త్వరలో అందుబాటులోకి తీసుకోస్తాం.


-  సేవా ఇస్లావత్, కమిషనర్, కరీంనగర్ నగరపాలక సంస్థ