ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలపై  కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా 66 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకూ బ్రేక్ ఇస్తారు. ఈ  విరామంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు..మంత్రుల డిమాండ్‌లను పరిశీలించి వాటి ఆధారంగా రిపోర్ట్‌లను రూపొందిస్తాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. 

గతేడాది ఆగస్టులో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము...తొలిసారిగా బడ్జెట్ సమావేశాల్లో  లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.  ఫిబ్రవరి 1న  నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం కేంద్ర బడ్జెట్పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెబుతారు. నీతి ఆయోగ్‌తో పూర్తి స్థాయిలో చర్చించాక బడ్జెట్‌ను రూపొందించనున్నారు. బడ్జెట్‌కు ఒక రోజు ముందు అంటే పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్‌ వీ అనంత నాగేశ్వరన్‌  ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తారు.

అటు బడ్జెట్ సమావేశాలకు కేంద్రం ఇప్పటికే  కసరత్తు మొదలు పెట్టింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఆర్థిక నిపుణులతో నీతి ఆయోగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. వారి అభిప్రాయాలు, సలహాలు అడిగి తెలుసుకుంది. ఈ సమావేశంలోఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలకు ముందు మోడీ  ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కావడంతో..బీజేపీ సర్కారు ఈ బడ్జెట్పై ఎక్కువ దృష్టి పెట్టింది.