పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే

పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే

పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్
సీఏఏపై అసెంబ్లీ తీర్మానాన్ని నిరసిస్తూ
ఢిల్లీలో బీజేపీ నేతల మౌన దీక్ష
వాళ్లపై ఎందుకంత ప్రేమ?: బాపూరావు

కేసీఆర్ జీవితం మాయా బజార్ గా మారిందని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్ పై కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులకు అవగాహన లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్లను వద్దన్న కేసీఆర్ కు, ఇప్పుడు ఇతర దేశాల ముస్లింలపై ప్రేమ ఎందుకు కలిగిందని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో ఎంఐఎం ఎక్కడైనా కన్పించిందా అని నిలదీశారు. మౌన దీక్షలో బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ బాల సుబ్రమణ్యం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని, ఈ విషయాన్ని విస్మరించిన కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. సీఎం వైఖరి తో తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటోందని తెలిపారు. సీఏఏ అంటే కేసీఆర్ కు తెలియదా? లేక తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారా అని మండిపడ్డారు. ఎన్పీఆర్​లో కేసీఆర్, ఒవైసీ కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోకపోతే.. వాళ్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్​లో ఏదో ఒక దేశానికి శరణార్థులుగా వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తే దోశద్రోహిగా మిగిలిపోతారని, ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకోవాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకపోతే బతుకు ఉండదని, మిలటరీని దించుతామని గతంలో కేసీఆర్ చెప్పారని.. ప్రస్తుతం ఎన్పీఆర్ ను అడ్డుకుంటే అదే జరుగుతుందని ఆయన అన్నారు.

సీఏఏపై రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ మేరకు మంగళవారం బండి సంజయ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు మౌన దీక్ష నిర్వహించారు. అనంతరం సంజయ్  మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏపై  తీర్మానంతో  కేసీఆర్ చేసిన దేశ ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఎన్పీఆర్ అమలు కోసం కేంద్రం కమిషనర్​ను నియమిస్తుందని, సీఎం కేసీఆర్, రాష్ట్ర అధికారులు ఆ కమిషనర్ పరిధిలో పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అసలు ఇతర దేశాల నుంచి ముస్లింలు భారత్ కు రావాలని సీఎం ఎందుకు కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇతర దేశాల ముస్లింల సంఖ్యను పెంచి, స్థానిక ముస్లింల ఉద్యోగాలు, ఉపాధి, విద్యా అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్ స్టూడెంట్స్​ ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల బలిదానాలు, కొండగట్టు ప్రమాదంలో మరణించిన వాళ్ల గురించి ఆలోచించే కనీస కనికరం లేని వ్యక్తిగా కేసీఆర్ మారారని, అలాంటి వ్యక్తి దేశం గురించి, జవాన్ల బలిదానాల గురించి ఏ విధంగా ఆలోచిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏం చేసినా.. ఎన్ని పన్నాగాలు పన్నినా సీఏఏ అమలై తీరుతుందన్నారు.

రానీయం, పోనీయం అంటే కుదరదు: అర్వింద్​

కేసీఆర్, ఒవైసీలు ఎన్పీఆర్ ను రాష్ట్రంలోకి  రానీయం, పోనీయం అంటే కుదరదని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఎన్పీఆర్ జాబితా లో వివరాలు నమోదు చేసుకోకపోతే ఓట్లు పోతాయని, తర్వాత ఓట్లు పోయాయని బాధపడొద్దని సూచించారు. ఇంతకన్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఎవరూ చెప్పలేరన్నారు. ఈ చట్టానికి అందరూ సహకరించి, ఎన్పీఆర్ పుస్తకాలలో తమ సమాచారాన్ని నింపాలని ఆయన కోరారు. సీఏఏపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదన్నారు.