ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ

ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ
  • కాంగ్రెస్​ సభ్యులపై వేటు వేసిన స్పీకర్
  • ఈ సెషన్ మొత్తానికీ అమలు
  • పార్లమెంట్​లో కొనసాగిన ఆందోళనలు.. పలుమార్లు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో ఆందోళనలకు దిగుతూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై లోక్​సభ స్పీకర్​ కఠిన చర్యలు తీసుకున్నారు. సభను తరచుగా అడ్డుకుంటున్న కారణంగా నలుగురు కాంగ్రెస్​ సభ్యులను సోమవారం సస్పెండ్​ చేశారు. ఇది ఈ సెషన్​ మొత్తం అమలులో ఉంటుందని ప్రకటించారు. సస్పెన్షన్ తర్వాత కూడా లోక్​సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి.

దీంతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోక్​సభ తరఫున స్పీకర్​ ఓంబిర్లా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎన్నికతో దేశ ప్రజలు గర్వపడుతున్నారని చెప్పారు. అలాగే వరల్డ్​ ఛాంపియన్​షిప్​ జావెలిన్​త్రోలో సిల్వర్​ మెడల్​ సాధించిన నీరజ్ ​చోప్రాను సభ అభినందించింది. నీరజ్​ ఘనత దేశంలో మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని స్పీకర్​ ఓం బిర్లా అన్నారు. 

లోక్​సభను అడ్డుకున్న ప్రతిపక్షాలు

లోక్​సభలో వరుసగా సోమవారం ఆరో రోజు ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. క్వశ్చన్​ అవర్​ మొదలుకాగానే వెల్​లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంపీలు వెనక్కి తగ్గాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్​ ఓంబిర్లా హెచ్చరించారు.

వారు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జనం సభ సజావుగా నడవాలని కోరుకుంటున్నారని సూచించారు. అయినా వెనక్కి తగ్గని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీల సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో స్పీకర్​ సభను 3 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మొదలైనంక  కూడా సభలో అనిశ్చితి కొనసాగింది. 

కేంద్రం బెదిరింపులకు లొంగేది లేదు: కాంగ్రెస్

స్పీకర్​ నిర్ణయంపై కాంగ్రెస్​ పార్టీ మండిపడింది. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఎన్డీయే సర్కారు బెదిరింపులకు తాము లొంగేది లేదని స్పష్టం చేసింది. ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోక్ సభలో కాంగ్రెస్​ డిప్యూటీ లీడర్​ గౌరవ్​ గొగోయ్​ ఆందోళన వ్యక్తం చేశారు.

వారు చేసిన తప్పేమిటని ఆయన  ప్రశ్నించారు. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించడమే వారు చేసిన తప్పా అని నిలదీశారు. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపు తదితర అంశాలపై చర్చించాలని తాము పట్టుబట్టామని, కానీ అందుకు ప్రభుత్వం సిద్ధంగాలేదని గౌరవ్​ గొగోయ్​ మండిపడ్డారు. 

హెచ్చరించినా వెనక్కి తగ్గలే..

స్పీకర్​ హెచ్చరికలను గుర్తు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని చైర్​లో ఉన్న రాజేంద్ర అగర్వాల్​ సూచించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో కాంగ్రెస్​ ఎంపీలు మాణిక్కం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్యా హరిదాస్​ లను సస్పెండ్​ చేస్తున్నట్టు ప్రకటించారు.
సస్పెండ్ అయిన సభ్యులు దురుసుగా ప్రవర్తించారని, ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని, సభా నియమాలు, స్పీకర్ ఆదేశాలను పట్టించుకోలేదని అగర్వాల్ పేర్కొన్నారు. వీరిని సస్పెండ్​ చేస్తున్నట్టుగా మూజువాణి ఓటుతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించగా.. నలుగురిని సస్పెండ్​ చేస్తున్నట్టు అగర్వాల్​ ప్రకటించారు. సస్పెండ్​ అయిన సభ్యులు వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

రాజ్యసభలోనూ వాయిదాలే..

రాజ్యసభలోనూ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. షెడ్యూల్​ కార్యకలాపాలను పక్కనపెట్టి ధరల పెరుగుదల చర్చించాలంటూ ప్రతిపక్షాలు వెల్​లోకి దూసుకెళ్లి ఆందోళన చేశాయి. దీంతో సభ 3 గంటలకు వాయిదా పడింది. తిరిగి మొదలైన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో మరోసారి రెండుసార్లు సభ వాయిదా పడింది. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ నాయకుడు మల్లిఖార్జున్​ఖర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వం ధరల పెరుగుదలపై చర్చకు భయపడి పారిపోయారని ఆరోపించారు.

ధరల పెరుగుదల అనేది చాలా పెద్ద అంశమని, దీనిపై చర్చకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. సభా నాయకుడు పియూష్​ గోయల్​ స్పందిస్తూ.. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కరోనాతో బాధపడుతున్నారని, ఆమె కోలుకోగానే ఈ అంశంపై చర్చ చేపడతామని చెప్పారు.

ప్రతిపక్షాలే చర్చకు సిద్ధపడటం లేదని, అందుకే మొదటిరోజు నుంచి సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. కాగా, జావెలిన్​త్రోలో సిల్వర్​ మెడల్​ సాధించిన నీరజ్ ​చోప్రాను రాజ్యసభ అభినందించింది. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్​ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.