పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు... లోక్ సభలో గందరగోళం..

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు... లోక్ సభలో గందరగోళం..

సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే గందరగోళానికి దారి తీశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు పట్టుబట్టడంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ డిమాండ్లను ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని అన్నారు స్పీకర్ ఓం బిర్లా. సభలో నినాదాలు చేయడం సరికాదని అన్నారు ఓం బిర్లా.

స్పీకర్ మాటలన ఏమాత్రం పట్టించుకోని విపక్ష సభ్యులు సభలో నిరసనకు దిగారు. విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇదిలా ఉండగా.. ఈ సెషన్​లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లుల‌‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది.

నేషనల్‌‌ స్పోర్ట్స్‌‌ గవర్నెన్స్‌‌ బిల్లు, జియోహెరిటేజ్‌‌ సైట్స్‌‌, జియో రెలిక్స్‌‌ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్‌‌ అండ్‌‌ మినరల్స్‌‌ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్‌‌ యాంటీ డోపింగ్‌‌ (సవరణ) బిల్లు, మణిపూర్‌‌ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, ఇతర బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. 

వీటితోపాటు ఇన్‌‌కంట్యాక్స్‌‌-–2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌‌ హైకోర్టు సిట్టింగ్‌‌ న్యాయమూర్తి జస్టిస్‌‌ యశ్వంత్‌‌వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానుంది.