లోక్ సభలో అదే సీన్.. రాజ్యసభ 27 నిమిషాలే!

లోక్ సభలో అదే సీన్.. రాజ్యసభ 27 నిమిషాలే!

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో శుక్రవారం కూడా అదే గందరగోళం కొనసాగింది. లోక్ సభలో పలుమార్లు వాయిదాల పర్వం నడిచింది. ప్రతిపక్షాల నిరసనల మధ్యే మూడు బిల్లులు పాస్ అయిన తర్వాత సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన తర్వాత 27 నిమిషాలకే వాయిదాపడింది. ఇటు లోక్ సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత ఆధిర్ రంజన్​కు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి మధ్య మాటలయుద్ధం జరిగింది. అటు పెద్దల సభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్​కు, చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖఢ్​కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.   

లోక్ సభలో ఇలా..

ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు లేచి నినాదాలు చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెండింగ్​లో ఉన్నందున, ఇతర ప్రొసీడింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టి అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్​ చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఎంతో ముఖ్యమైన క్వశ్చన్ హవర్​ను జరగనీయరా?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ స్పందిస్తూ.. వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్నీ రూల్స్ ప్రకారమే జరుగుతున్నాయని, అవిశ్వాసంపై చర్చ పది రోజుల్లోగా ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా సభ్యుల అరుపులు, కేకలతో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం కాగానే స్పీకర్ స్థానంలో రాజేంద్ర అగర్వాల్ ప్రొసీడింగ్స్ నిర్వహిస్తూ..  పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. ప్రతిపక్షాల నిరసన కొనసాగుతుండటంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. 

రాజ్యసభలో ఇలా.. 

పెద్దలసభలో ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ఇద్దరు సభ్యులకు బర్త్ డే గ్రీటింగ్స్, రిటైర్ అవుతున్న బీజేపీ సభ్యుడు వినయ్ దినూర్ టెండూల్కర్​కు వీడ్కోలు చెప్తూ పలువురు సభ్యులు మాట్లాడారు. ఆ వెంటనే మణిపూర్ అంశంపై రూల్ 267 కింద సుదీర్ఘ చర్చ చేపట్టాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.  దీంతో చైర్మన్ అసహనం వ్యక్తంచేశారు. ‘‘రోజూ ఇలా సభను అడ్డుకోవడం ఏంటీ? రూల్ 267 కింద ఇచ్చిన నోటీసులను గత 23 ఏండ్లలో ఎన్ని సార్లు ఆమోదించారో తెలియదా?” అని ఫైర్ అయ్యారు. టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ స్పందిస్తూ.. తమకు ఈ విషయం తెలుసన్నారు. ‘‘మీకు ఈ విషయం తెలుసని నాకు తెలుసు సర్. మీరు ప్రకటనలు చేయొద్దు. జస్ట్ వినండి చాలు” అని చైర్మన్ చెప్పారు. అయినా, ఓబ్రెయిన్ అలాగే మాట్లాడటంతో చైర్మన్ తీవ్రంగా స్పందించారు. ‘‘సభలో ఇలా నాటకాలు చేయడం మీకు అలవాటుగా మారింది  ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు” అంటూ మండిపడ్డారు.