
- సాధ్యాసాధ్యాలు పరిశీలించండి: వెంకయ్య, ఓం బిర్లా
- రాజ్యసభ, లోక్‌సభ సెక్రెటరీ జనరల్స్‌కు ఆదేశం
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీల మీటింగ్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ప్రయత్నాలు సాగుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్పై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని రెండు సభల సెక్రెటరీ జనరల్స్‌ను రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. లాక్డౌన్ కారణంగా ఎంపీలంతా ఇండ్లకే పరిమితం కావడంతో పార్లమెంట్ కమిటీల మీటింగ్స్ పెండింగ్‌లో పడిపోయాయి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్స్ పెట్టాలని పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ను కోరారు. గురువారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాస్‌లో సమావేశమైన వెంకయ్య, ఓం బిర్లా.. పార్లమెంటరీ కమిటీల మీటింగ్స్పై చర్చించారు. రెగ్యులర్ మీటింగ్స్ జరిగే పరిస్థితి కనిపించనట్లయితే ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్పై సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని వారు సెక్రెటరీ జనరల్స్‌ను ఆదేశించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ తమ నియోజకవర్గాల ప్రజలతో ఎంపీలు కలసి ముందుకెళ్లడంపై ఓం బిర్లా, వెంకయ్య సంతోషం వ్యక్తం చేశారు.