సిటిజన్​షిప్​ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

సిటిజన్​షిప్​ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

రాజ్యసభలో 7 గంటలపాటు చర్చ
బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు
వీగిన సెలెక్ట్కమిటీ డిమాండ్
వాకౌట్ చేసిన శివసేన ఎంపీలుదేశంలో ఇప్పుడు ఎన్నికలే లేవు..
ఇక రాజకీయ ఎజెండా ఎక్కడిది: షా
గతంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నం

న్యూఢిల్లీసిటిజన్ షిప్​​ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై ఆరున్నర గంటలపాటు వాడివేడి డిబేట్​ జరిగింది. బిల్లుకు అనుకూలంగా125  మంది, వ్యతిరేకంగా  99  మంది ఓటేశారు. లోక్​సభ సోమవారంనాడే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో సంతకం కోసం బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళుతుంది.  లోక్​సభలో బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ ఒకప్పటి మిత్రపక్షమైన శివసేన యూ టర్న్​ తీసుకుంది. ఓటింగ్​లో పాల్గొనకుండా సభ నుంచి వాకౌట్​ చేసింది. అంతకుముందు బిల్లును సెలక్ట్​ కమిటీకి పంపాలని కాంగ్రెస్​, లెఫ్ట్​ పార్టీలు డిమాండ్​ చేయడంతో  రాజ్యసభ చైర్మన్​  వెంకయ్యనాయుడు దీనిపై ఓటింగ్​జరిపారు.   99 మంది  బిల్లును సెలక్ట్​ కమిటీకి పంపాలంటూ ఓటేశారు. 124 మంది సభ్యులు  పంపొద్దని ఓటేశారు. దీంతో  ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ వీగిపోయింది.

ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టిన అమిత్ షా

అంతకుముందు ప్రతిపక్షాల ఆరోపణలకు హోం మంత్రి గట్టిగా సమాధానం చెప్పారు.  ఇతర సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడంలేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పిదాలను మోడీ సర్కార్​ సరిచేస్తోందని  చెప్పారు.  ఈ బిల్లు  సిటిజన్​షిప్​ కల్పిస్తుందే కాని దాన్ని హరించబోదని షా హామీ ఇచ్చారు.  పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​, కాంగ్రెస్​ పార్టీ అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని ఆయన విమర్శించారు.  ఎన్​ఆర్సీ, ఆర్టికల్​ 370 రద్దు లాంటి ఇష్యూలపై ఇమ్రాన్​, కాంగ్రెస్​ రెండూ ఒకేరకమైన అభిప్రాయాలను వ్యక్తంచేశాయని  అన్నారు. బీజేపీకి రాజకీయ ఏజెండా ఉందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్ని ఖండించిన అమిత్​ షా… ఇప్పుడు దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవన్నారు. 50 ఏళ్ల క్రితమే ఈ బిల్లు తీసుకొస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదికాదని అమిత్​షా అన్నారు.

ఉదయం బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లు ఉద్దేశాన్ని అమిత్​ షా సభ్యులకు వివరించారు. సిటిజన్​షిప్​ (సవరణ) బిల్లు వల్ల దేశంలోని ముస్లింలు భయపడాల్సిన అవసరంలేదని అమిత్​షా హామీ ఇచ్చారు. ‘వాళ్లు (ఇండియన్​ముస్లింలు) ఎప్పుడూ దేశ పౌరులుగానే ఉంటారు”అని  సిటిజన్​ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెడుతూ చెప్పారు.  ఆ మతానికి చెందినవాళ్లను (ఇండియన్​ముస్లింలు) ఎవరూ వేధించబోరన్న హోంమంత్రి…ఆఫ్గనిస్తాన్​, బంగ్లాదేశ్​, పాకిస్తాన్​ నుంచి  అక్రమంగా మనదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు ఇండియన్​  సిటిజన్​షిప్​ ఇవ్వడానికే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు షా సభకు వివరించారు.  2014కి ముందు ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైగ్రెంట్స్​కు ఇండియన్‌ సిటిజన్​షిప్​ ఇవ్వనున్నట్టు  చెప్పారు. అలాంటి వాళ్లపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోమని,  పెట్టిన కేసుల్ని కూడా వాపస్​ తీసుకుంటామని
తెలిపారు. ​

వాళ్ల విమర్శల్లో నిజం లేదు: అమిత్‌ షా

బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని మంత్రి చెప్పారు. అయితే ఇతర దేశాల నుంచి అక్రమంగా వలసవచ్చిన ముస్లింలకు మాత్రం ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వదని తేల్చిచెప్పారు. ‘‘పాకిస్తాన్, బంగ్లాదేశ్​, ఆఫ్గనిస్తాన్​​ నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలా? ఇలాగైతే ఈ దేశాన్ని ఎలా నడిపించగలం” అని అమిత్​ షా సభ్యుల్ని ప్రశ్నించారు. పక్కదేశాల్లో వేధింపులకు గురైన కోట్లాది మంది జీవితాల్లో ఆశాకిరణాలు వెలిగేందుకు ఉద్దేశించిన బిల్లు చారిత్రాత్మకమైనదని ఆయన అన్నారు. “వాళ్లంతా సగౌరవంగా వాళ్ల మతాలను అనుసరించవచ్చు.  ఆడవాళ్ల డిగ్నిటీని కూడా వాళ్లు రక్షించుకోవచ్చు”అని మంత్రి చెప్పారు. ఆఫ్గనిస్తాన్​, పాకిస్తాన్​, బంగ్లాదేశ్​ ప్రభుత్వాలు అక్కడి మైనార్టీలను అక్కడి మతాల వాళ్లతో సమానంగా చూడడంలేదని, అందుకే వాళ్ల జనాభా 20 శాతం తగ్గిపోయిందని షా  వివరించారు.  వాళ్లను చంపడమో, బలవంతంగా మతమార్పిడి చేయించడమో లేదా మనదేశానికి పంపించడమో లాంటి విధానాల వల్లే అక్కడి మైనార్టీల జనాభా దారుణంగా పడిపోయిందని కేంద్రమంత్రి చెప్పారు. “అలాంటి వాళ్లంతా మనదేశంలో కాందిశీకులుగా కాలం గడుపుతున్నారు. వాళ్లకు ఇళ్లు లేవు. ఉద్యోగాలు లేవు. హెల్త్​కేర్​ సదుపాయాలు లేవు. చదువుకోవడానికి కూడా అవకాశాల్లేవు” అని అమిత్‌ షా అన్నారు.  బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు తెలిపాయి.