బీజేపీ ఎంపీ పాస్ తోనే.. లోక్ సభలోకి వచ్చిన ఆ ఇద్దరు

బీజేపీ ఎంపీ పాస్ తోనే.. లోక్ సభలోకి వచ్చిన ఆ ఇద్దరు

కేంద్ర బలగాలు,నిఘా వర్గాలు సహా ఇతర ప్రత్యేక బలగాలు భద్రత కల్పించే పార్లమెంటులోకి ఇద్దరు  అగంతకులు  దూసుకెళ్లి స్ప్రే వదలడం కలకలం రేపుతోంది.   కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోక్ సభ జరుగుతుండగా.. ఆ ఇద్దరు యువకులు ఎలా సభలోకి దూసుకు వచ్చారనేది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. పార్లమెంట్ చుట్టూ ఐదంచెల అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఎలాంటి ఐడీ కార్డు లేకుండా ఎవర్నీ లోపలికి పంపించారు. లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు చూడటానికి వెళ్లాలన్నా.. గ్యాలరీలోకి వెళ్లాలన్నా కనీసం రికమండేషన్ లెటర్ ఉండాలి.. మీడియా అయినా సరే కంపెనీ ఐడీ కార్డు.. అనుమతి పత్రం ఉండాలి.ఇక గ్యాలరీలోకి వెళ్లాలంటే ఎంపీల సిఫార్సు లేఖ ఉండాల్సిందే. ఎంపీల పీఏలకు ప్రత్యేక ధృవీకరణ కార్డులు ఉంటాయి.. పార్లమెంట్ ఆవరణలోకి ఎవరు పడితే వాళ్లు.. ఎలా పడితే అలా వెళ్లటానికి అవకాశం ఉండదు.

అయితే   గ్యాస్ వదిలిన నిందితులు కర్ణాటకలోని మైసూరుకు చెందిన  బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా  విజిటింగ్ పాస్ తో లోపలికి వచ్చారని తెలుస్తోంది.  దీంతో పాస్ జారీ చేసిన ఎంపీ ప్రతాప్ సిన్హా పేషీలోని వారిని  పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  అటు పార్లమెంట్ బయట  గందరగోళం సృష్టించిన ఇద్దరు అమోల్ షిండే, నీలం అని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. వీరు ఏ ప్రాంతానికి చెందినవారు. ఏ ఉద్దేశంతో ఇలా చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. 

 లోక్ సభలో వదిలిన టియర్ గ్యాస్  రిలీజ్ చేసిన ఘటనై విచారణకు ఆదేశించినట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఈ ఘటన అనంతరం సభలో మాట్లాడిన ఆయన సభలోకి ప్రవేశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పోలీసులకు వివరాలు అందించామన్నారు. సభలో వదిలిన పొగ ప్రమాదకరమైనది కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అది కలర్ స్మోక్  అని ఎంపీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 

ఇవాళ ఉదయం సభలోకి ప్రవేశించిన అగంతకులు షూలలో రహస్యంగా గ్యాస్ అమర్చుకుని  విజిటర్స్ గ్యాలరీలోకి  ప్రవేశించి సభలో దూకారు. సభలో కొద్ది సేపు బల్లలపై దూకుతూ గందరగోళం సృష్టించారు. దీంతో సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఊహించని పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.