
- 17 బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం యోచన
- వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న ప్రతిపక్షాలు
- ఆపరేషన్ సిందూర్, బిహార్‌లో ఓటరు జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టే చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో.. మొత్తం 21 రోజులపాటు ఉభయ సభలు సాగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జరగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, ఇతర బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. వీటితోపాటు ఇన్‌కంట్యాక్స్-–2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానుంది.
కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధం
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇండియా బ్లాక్ పార్టీలు పట్టుబట్టాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులను పక్కనపెట్టింది. భారత్, పాక్ యుద్ధంలో 5 యుద్ధ విమానాలు నేలకూలాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, కాల్పుల విరమణ కామెంట్స్‌పై ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితోపాటు మహిళలపై దాడులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలాంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి, ఇతర పార్టీలు సిద్ధమయ్యాయి.