ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఎకనమిక్ సర్వేను సభ ముందు ఉంచనున్నారు. బుధవారం బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మోడీ-2 ప్రభుత్వంలో ఇది చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌‌. ఈ సమావేశాల్లో 36 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రెండు విడతలుగా ఈ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 14న తొలి విడత ముగియనుండగా.. రెండో విడత మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 దాకా కొనసాగనుంది. ఈ పీరియడ్‌‌లో 27 సిట్టింగ్స్ జరగనున్నాయి. మరోవైపు అదానీ – హిండెన్‌‌బర్గ్ వివాదం, దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కింపు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. 

అదానీ వ్యవహారంపై చర్చ జరపాలి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రూల్స్ ప్రకారం ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో సోమవారం ప్రతిపక్షాలతో ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌‌లో జరిగిన ఈ సమావేశానికి 27 పార్టీల నేతలు హాజరయ్యారు. ఆప్, ఆర్జేడీ, డీఎంకే, లెఫ్ట్, ఇతర పార్టీలు అదానీ వ్యవహారాన్ని లేవనెత్తాయి. పార్లమెంటులో ఈ అంశంపై చర్చించాలని కోరాయి. గవర్నర్ల అంశాన్ని డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు ప్రస్తావించాయి. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కింపును చేపట్టాలని వైసీపీ కోరింది. మహిళా కోటా బిల్లును ప్రవేశపెట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనకు బీఆర్ఎస్, టీఎంసీ, బీజేడీ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. ఆల్ పార్టీ మీటింగ్‌‌కు కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నుంచి ఎవరూ హాజరుకాలేదు.